Telangana Assembly : గ‌వ‌ర్న‌ర్ కు దూరంగా తెలంగాణ అసెంబ్లీ?

గ‌త రెండు, మూడు సెష‌న్ల నుంచి గవ‌ర్న‌ర్ ప్ర‌సంగాలు లేకుండానే తెలంగాణ అసెంబ్లీ జ‌రుగుతోంది. ఈసారి కూడా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా మంగ‌ళ‌వారం స‌భ ప్రారంభం కానుంద‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - September 5, 2022 / 04:39 PM IST

గ‌త రెండు, మూడు సెష‌న్ల నుంచి గవ‌ర్న‌ర్ ప్ర‌సంగాలు లేకుండానే తెలంగాణ అసెంబ్లీ జ‌రుగుతోంది. ఈసారి కూడా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా మంగ‌ళ‌వారం స‌భ ప్రారంభం కానుంద‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. ఒక వేళ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై అసెంబ్లీ తొలి రోజు ప్ర‌సంగించాలంటే ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ్ భ‌వ‌న్ కు ఎలాంటి ప్ర‌సంగం సీఎంవో నుంచి రాలేద‌ని స‌మాచారం. ఫ‌లితంగా ఈసారి కూడా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం అవుతుంద‌ని భావిస్తున్నారు.

గ‌త ఏడాదిన్న‌ర‌గా ప్ర‌గ‌తీభ‌వ‌న్, రాజ్ భ‌వ‌న్ కు మ‌ధ్య అంత‌రం కొన‌సాగుతోంది. ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్ నిర్వ‌హించిన `ఎట్ హోం` కు కూడా కేసీఆర్ గైర్హాజ‌రు అయ్యారు. తాజాగా జ‌రిగిన కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్ ఫెయిల్యూర్ పై గ‌వ‌ర్న‌ర్ ఆగ్ర‌హంగా ఉన్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కార‌ణంగా ఆ సంఘ‌ట‌న జ‌రిగింద‌ని భావిస్తున్నారు. గ‌తంలోనూ కేసీఆర్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై కేంద్రానికి త‌మిళ సై ఫిర్యాదు చేశారు. ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ పై. విరుచుకుప‌డ్డారు. ప‌లు సంఘ‌ట‌న‌లు కేసీఆర్, త‌మిళ సై మ‌ధ్య పొస‌గ‌ని ప‌రిస్థితి ఉంది. అందుకే, ఈసారి కూడా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా కేసీఆర్ అసెంబ్లీని నిర్వ‌హిస్తార‌ని తెలుస్తోంది. కానీ, రాజ్యాంగం ప్ర‌కారం గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉండాలి. కానీ, దానిలోని కొన్ని లోపాల‌ను ప‌ట్టుకుని గ‌వ‌ర్న‌ర్ ను దూరంగా పెడుతున్నారు. ఈసారి కూడా అలాగే జ‌రుగుతుంద‌ని టీఆర్ఎస్ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

అసెంబ్లీ వేదికగా బీజేపీని టార్గెట్ చేయాల‌ని గులాబీద‌ళం సిద్ధం అవుతోంది. శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాల్లో బీజేపీని ఇరుకున పెట్టేందుకు అస్త్రాల‌ను సిద్ధం చేసుకుంది. తెలంగాణపై బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘వివక్ష చూపుతుంద‌నే అంశాన్ని ప్ర‌ధానంగా ఫోక‌స్ చేయ‌బోతున్నార‌ని తెలిసింది. సిబిఐ, ఇడి, ఐటి డిపార్ట్‌మెంట్ త‌దిత‌ర కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అంశాన్ని హైలెట్ చేయ‌నుంది. ఇంధనం, ఎల్‌పిజి ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వంటి అంశాల‌ను అసెంబ్లీ వేదిక‌గా వెలుగొత్తాల‌ని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. విభజన , విధ్వంస‌, మతతత్వాన్ని ప్రోత్సహించడంపై ప్రత్యేక చర్చను నిర్వహించాలని అధికార పార్టీ యోచిస్తోంది.

సభ ఎన్ని రోజులు జరగాలనే దానిపై క్లారిటీ లేకపోయినా, సెప్టెంబర్ 6, 13, 14 తేదీల్లో మూడు రోజుల పాటు సభ జరగనుందని తెలుస్తోంది. ఆ మూడు రోజుల్లో ఒక రోజు కేంద్రం వైఫల్యాలు, చర్యలపై చర్చకు కేటాయిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 10వ తేదీ వరకు గణేష్ నిమజ్జన బందోబస్త్‌తో పోలీసు యంత్రాంగం బిజీబిజీగా ఉంటుంది. సెప్టెంబర్ 6న సభ ప్రారంభమైన తర్వాత వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని నిబంధనలను అమలు చేయడంలో కేంద్రం వైఫల్యంపై ట్రెజరీ బెంచ్‌లు చర్చించాలన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణాల కోత, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు రుణాల నిలిపివేత, వరి సేకరణపై ఆంక్షలు విధించడం త‌దిత‌రాల‌పై చర్చ జ‌రిగేలా కేసీఆర్ వ్యూహం ర‌చించారు. తెలంగాణకు నిధులు, ప్రాజెక్టుల మంజూరు, ఇతర అంశాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు రూ.6,000 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశించిన అంశంపైనా చ‌ర్చ‌కు పెట్టాల‌ని కేసీఆర్ యోచిస్తున్నారు.
సభలో ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్‌ఎస్‌ ప్రధాన లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ రాజకీయ కార్యాచరణను పెంచడంతో అధికార పార్టీ రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంది.
టిఆర్‌ఎస్‌కు అసెంబ్లీలో 103 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఏడుగురు ఎఐఎంఐఎం సభ్యుల మద్దతు ఉంది. బిజెపి కేవలం ముగ్గురిని మాత్రమే క‌లిగి ఉంది. వీరిలో గోషామహల్ శాసనసభ్యుడు టి.రాజా సింగ్ ప్ర‌స్తుతం చ‌ర్ల‌ప‌ల్లి జైలులో ఉండడంతో అసెంబ్లీకి హాజరుకావడం అనుమానంగా కనిపిస్తోంది.ఇక బీజేపీకి ఎం. రఘునందన్ రావు, ఈటల రాజేందర్ మాత్రమే మిగిలారు. గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేయ‌డాన్ని నిర‌సించిన ముగ్గురు బిజెపి సభ్యులు మునుపటి బడ్జెట్ సెషన్‌లో మాట్లాడలేకపోయిన విష‌యం విదిత‌మే. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుంద‌ని భావిస్తున్నారు.