Telangana High court: కుదిరిన సయోధ్య.. ‘బడ్జెట్’ సమావేశాలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్!

బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం

  • Written By:
  • Updated On - January 30, 2023 / 03:45 PM IST

2023-24కు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ (State Budjet) ను ప్రవేశ పెట్టడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరినా గవర్నర్ తమిళిసై (Governer) ఇంకా స్పందించలేదు. ఫిబ్రవరి 3నే సమావేశాలు ప్రారంభం కానున్నందున.. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అంతకు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పిటిషన్‌ను స్వీకరించే ముందు హైకోర్టు (High Court) చీఫ్ జస్టీస్ ఉజ్వల్ భుయాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో గవర్నర్‌కు కోర్టు నోటీసులు ఇవ్వగలదా? గవర్నర్ విధుల్లో కోర్టులు న్యాయ సమీక్షలు చేయవచ్చా అని అడ్వొకేట్ జనరల్‌ను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తామని ఏజీకి తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీకోర్టు లాయర్ దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తారని ఏజీ హైకోర్టుకు తెలిపారు.

గవర్నర్ తరపు లాయర్ అశోక్ రాంపాల్, రాష్ట్ర ప్రభుత్వ లాయర్ దుష్యంత్ దవే మధ్య చర్చలు జరిగాయి. ప్రభుత్వం (TS Govt), గవర్నర్ మధ్య ఉన్న వివాదాలు పరిష్కారం అయ్యేలా ఇరు వర్గాలు సయోధ్యకు వచ్చారు. ఈ నెల 26న ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు స్వయంగా గవర్నర్‌ను కలిసి బడ్జెట్ సమావేశాల గురించి తెలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఈ నెల 27న సమావేశాలకు ఆమోదం తెలపాలని లేఖ రాశారు. కాగా, బడ్జెట్ సమావేశాల (State Budjet) సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందా లేదా అని ప్రభుత్వానికి గవర్నర్ లేఖ రాశారు. ఈ విషయమే ఇరు లాయర్ల చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ న్యాయవాది దవే తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరింది. ఈ విషయాన్నే ప్రభుత్వ లాయర్ హైకోర్టుకు తెలిపారు. గవర్నర్‌పై పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. గవర్నర్ ప్రసంగం (Governer Speech) తోనే సమావేశాలు ప్రారంభం అవుతాయని హైకోర్టుకు దవే తెలిపారు. అలాగే గవర్నర్‌ను విమర్శించవద్దనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తానని కూడా దవే హైకోర్టుకు విన్నవించారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఉన్న వివాదం ఈ రోజుతో ముగిసినట్లే అని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై హైదరాబాద్ తిరిగి రాగానే బడ్జెట్ (State Budjet) సమావేశాలకు పచ్చ జెండా ఊపుతారని.. అంతే కాకుండా ఆర్థిక బిల్లు ముసాయిదాకు కూడా ఆమె ఆమోదం తెలియజేస్తారని గవర్నర్ తరపు లాయర్ తెలిపారు.

Also Read: Covert Politics: బీజేపీలో ‘కోవర్ట్’ రాజకీయం.. ఈటలకు విజయశాంతి కౌంటర్!