Polavaram Issue : `పోల‌వ‌రం`పై బాహుబ‌లి ద‌రువు

బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టే ప్ర‌య‌త్నం చేయొద్ద‌ని పెద్దలు చెప్పే సూక్తి. ఇదే సూక్తిని తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ‌ర్తింప చేసేలా తెలంగాణ మంత్రి అజ‌య్ పోల‌వ‌రంపై చేసిన మాట‌లు ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

  • Written By:
  • Updated On - July 21, 2022 / 11:57 AM IST

బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టే ప్ర‌య‌త్నం చేయొద్ద‌ని పెద్దలు చెప్పే సూక్తి. ఇదే సూక్తిని తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ‌ర్తింప చేసేలా తెలంగాణ మంత్రి అజ‌య్ పోల‌వ‌రంపై చేసిన మాట‌లు ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. పోల‌వ‌రం రూపంలో రాజ‌కీయాన్ని ఇరు రాష్ట్రాల నేత‌లు రాజేస్తున్నారు. సెంటిమెంట్ ను న‌మ్ముకుని రాజ్యాధికారాన్ని ముద్దాడిన కేసీఆర్ వీలున్న‌ప్పుడ‌ల్లా ఏపీ, తెలంగాణ మ‌ధ్య నీళ్ల వాటాను ర‌క్తిక‌ట్టిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల కోసం ఉద్య‌మం చేసిన కేసీఆర్ ప్ర‌స్తుత పాల‌న పూర్తి విరుద్ధంగా ఉంద‌ని ఉద్య‌మకారులు తిర‌గ‌బడుతోన్న త‌రుణ‌మిది. పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలు తేల్చ‌క‌పోవ‌డంతోనే నియామ‌కాలు, నీళ్లు, నిధులు రావ‌డంలేద‌ని చెప్పే ప్ర‌య‌త్నం ప‌లుమార్లు చేశారు. ఇప్పుడు ఎన్నిక‌లు సమీపిస్తోన్న వేళ పోల‌వ‌రం అంశాన్ని తెర‌మీద‌కు తీసుకురావ‌డం ద్వారా కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేయ‌డానికి సిద్ధం అయింది.

ల‌క్ష కోట్ల‌కు పైగా ఖ‌ర్చచేసి నిర్మించిన కాళేశ్వ‌రం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా తొలి నుంచి ప్ర‌త్య‌ర్ఖి పార్టీలు ఆరోపిస్తున్నాయి. వాళ్ల ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరేలా వ‌ర‌ద‌ల‌కు బాహుబ‌లి మోటార్ల‌తో స‌హా కాళేశ్వ‌రం ప్రాజెక్టు డామేజ్ అయింది. మ‌ర‌మ్మ‌తుకు కొన్ని వంద‌ల కోట్లు అవ‌స‌ర‌మ‌ని చ‌ర్చ జ‌రుగుతోన్న వేళ, ఏపీలో నిర్మిస్తోన్న పోల‌వ‌రం వైపు మొత్తం వ్య‌వ‌హారాన్ని కేసీఆర్ మ‌ళ్లించారు. మంత్రి పువ్వాడ్ అజ‌య్ తో పాటు ఇరిగేష‌న్ ముఖ్య అధికారిగా ఉన్న ర‌జ‌త్ కుమార్ కూడా పోల‌వ‌రం రాజ‌కీయంలోకి ఎంట్రీ ఇచ్చారు. పోల‌వ‌రం నిర్మాణం కార‌ణంగా తెలంగాణ రాష్ట్రంలోని ల‌క్ష ఎక‌రాలు ముంపునకు గుర‌వుతాయ‌ని తాజాగా ఆయ‌న చెప్ప‌డం పొలిటిక‌ల్ ర‌చ్చ ను ర‌గిలించారు.

భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద పోటెత్తడానికి ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు కారణమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోప‌ణ‌ల‌కు ప్ర‌తిగా ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు ధీటుగా స్పందించారు. ఇరు రాష్ట్రాల మంత్రులు పత్రికా ప్రకటనల ద్వారా పోల‌వ‌రం నిర్మాణాన్ని ర‌క్తిక‌ట్టించారు. టీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం అసలు ప్లాన్‌ను మార్చిందని, మూడు మీటర్ల ఎత్తు పెంచింద‌ని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే భద్రాచలం ముంపునకు కార‌ణ‌మ‌ని ఆరోపించ‌డం ఇరు రాష్ట్రాల మ‌ధ్య నీళ్ల వివాదానికి కార‌ణం అయింది.

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినందున కేంద్రం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని ఏపీకి చెందిన ఐదు గ్రామాల విభజనకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం బిల్లును ఆమోదించి తెలంగాణకు అప్పగించాలన్న డిమాండ్ తెర‌మీద‌కు తీసుకొచ్చింది. ఫ‌లితంగా కేంద్రంలోని బీజేపీని ఇరుకున పెట్ట‌డానికి మ‌రో అవ‌కాశాన్ని టీఆర్ఎస్ సానుకూలంగా మ‌లుచుకుంటోంది.

విభజన సమయంలో హైదరాబాద్‌ను కోల్పోయినందున ఏపీ ఆదాయాన్ని కోల్పోయిందని విజయవాడలో ప్రెస్ మీట్‌లో బొత్స మీడియా ప్రతినిధులతో ఏపీ మంత్రులు ఎంట్రీ ఇచ్చారు. “హైదరాబాద్‌ను ఏపీలో కలపమని ఇప్పుడు అడగవచ్చా? అంటూ నిల‌దీశారు. మంత్రులు, సీఎంలు బాధ్యతగా మాట్లాడాలని, ఇతరులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయవద్దని బొత్స హిత‌వు ప‌లికారు. ఏపీకి చెందిన పోలవరం ప్రాజెక్ట్ నుంచి విడుదల చేసిన నీటి వల్ల భద్రాచలం ముంపునకు గురవుతోందన్న వాదనలను కూడా ఆయన కొట్టిపారేశారు. ఏపీ ప్రభుత్వం ఐదు గ్రామాలకు అవసరమైన సహాయక చర్యలు చేపడుతుందని, గ్రామాల విభజనపై పునరాలోచనపై అనవసర వ్యాఖ్యలు చేయవద్దని పువ్వాడ అజయ్‌కు సూచించారు.

ఆమోదించిన డిజైన్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు ఎత్తును నిర్ణయించామని, అందులో ఎలాంటి మార్పు చేయలేదని బొత్స అన్నారు. ఖమ్మంలో వరద బాధిత ప్రాంతాలను అజయ్ తప్పక చూసుకుంటారని, ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ముంపు మండలాలను ఆదుకుంటుందని మాటల యుద్ధాన్ని ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద 45.72 అడుగుల నీటి ఎత్తు ఉన్నా భద్రాచలంపై ఎలాంటి ప్రభావం ఉండదని, వరదలు వచ్చినప్పుడల్లా పోలవరం అంశాన్ని రాజకీయం చేయడం తగదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

హైదరాబాద్‌పై ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై పువ్వాడ అజయ్ ఘాటుగా స్పందించారు. “హైదరాబాద్‌ను ఏపీలో కలపడంపై ఏపీ మంత్రులు అప్రస్తుతమని లేవనెత్తడం హాస్యాస్పదంగా ఉంది. భద్రాచలం ముంపునకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.1,000 కోట్లు కేసీఆర్‌ మంజూరు చేశారని తెలిపారు. ఏపీలో విలీనమైన భద్రాచలం పరిసర గ్రామాలను తిరిగి తెలంగాణకు అప్పగిస్తే తప్ప ఈ పనులు సమర్థవంతంగా చేపట్టలేం. కనీసం ఐదు గ్రామాలనైనా తెలంగాణకు అప్పగించాలి. భద్రాచలం ఆలయాన్ని వరదల నుంచి కాపాడే విషయంలో ఏపీ మంత్రులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ తో చర్చలు జరపాల‌ని డిమాండ్ చేశారు. మొత్తం మీద పోల‌వ‌రం చుట్టూ రాజ‌కీయాన్ని ర‌క్తి క‌ట్టిస్తూ ముంద‌పు ప్రాంతాల‌కు న్యాయం చేసే అంశం, కాళేశ్వ‌రం డామేజ్ ను టీఆర్ఎస్ హైజాక్ చేసింద‌న్న‌మాట‌.