అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) తాజాగా చేసిన ప్రకటన తెలంగాణ ఫార్మా పరిశ్రమలకు పెద్ద సవాల్‌గా మారింది. అమెరికాకు ఎగుమతయ్యే మందులపై 100% సుంకం (Trump slaps 100% tariff) విధించనున్నట్లు ఆయన చెప్పడం వల్ల రాష్ట్ర ఫార్మా ఎగుమతులపై నేరుగా ప్రభావం పడనుంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ వంటి ప్రాంతాల్లో ఉన్న వందలాది చిన్న, మధ్యతరహా, పెద్ద ఫార్మా సంస్థలు తమ ఉత్పత్తులను అమెరికాకు పంపుతున్నాయి. సంవత్సరానికి దాదాపు 500 మిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను తెలంగాణ నుంచి అమెరికా మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్నారు.
Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్ గెల్చుకునే ఛాన్స్ !!
ప్రత్యేకంగా బ్రాండెడ్, పేటెంట్ ఔషధాలపై ఈ సుంకం విధించనుండటంతో, వాటి ధరలు అమెరికా మార్కెట్లో భారీగా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా అమెరికా దిగుమతిదారులు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతికే అవకాశం ఉండగా, తెలంగాణలోని ఫార్మా కంపెనీల ఆదాయాలు పడిపోవచ్చు. అయితే జెనరిక్ ఔషధాలకు డిమాండ్ స్థిరంగా ఉండే అవకాశం ఉన్నా, మొత్తం వ్యాపార లాభాల్లో పెద్ద తగ్గుదల వచ్చే అవకాశాన్ని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిస్థితిని అంచనా వేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. మంత్రి శ్రీధరాబాబు అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, అమెరికా నిర్ణయాన్ని సవరించే ప్రయత్నం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణలో ఫార్మా రంగం లక్షలాది ఉద్యోగాలను, వందల కోట్ల పెట్టుబడులను కలిగి ఉండటం వల్ల, ఈ సమస్యను ఎదుర్కోవడంలో తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.