TRS ZPTCs: జడ్పీ చైర్ పర్సన్ పై తిరగబడ్డ టీఆర్ఎస్ జడ్పీటీసీలు

తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంతర్గత విభేదాలు వేధిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - November 23, 2022 / 03:19 PM IST

తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంతర్గత విభేదాలు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అంగోతు బిందుపై జడ్పీటీసీలు మండిపడ్డారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) జెడ్పీటీసీలు బహిష్కరించారు. మహబూబాబాద్ జిల్లాలోని తమ మండలాలకు నిధుల కేటాయింపులో ఆమె వివక్ష చూపుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ జడ్పీటీసీలు సమావేశానికి వచ్చినా, మీటింగ్ హాలులోకి రాకుండా బయటే నిరసనకు దిగారు. బహిష్కరణ విరమించాలని మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే బీ శంకర్ నాయక్ ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గలేదు.

జెడ్పీ నిధులను జెడ్పీ చీఫ్ బిందు దుర్వినియోగం చేస్తున్నారని, వాటిని అన్ని మండలాలకు కేటాయించడం లేదని జడ్పీటీసీలు ఆరోపించారు.  మొత్తం నిధుల్లో దాదాపు 60 శాతం తన సొంత మండలం బయ్యారంకే కేటాయించారని ఆరోపించారు. “ఆమె మిగిలిన 40 శాతం నిధులను కూడా న్యాయమైన పద్ధతిలో కేటాయించడం లేదు. కొంతమంది ZPTCలపై వివక్ష చూపుతోంది” అని మండిపడ్డారు. ఒకవైపు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అంతర్గత విబేధాలు, గ్రూపు తగాదాలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్న ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ జడ్పీటీసీలు సమావేశాన్ని బహిష్కరించడం హాట్ టాపిక్ గా మారింది.