BJP Vs TRS : గులాబీ, క‌మ‌లం.. ‘మ‌తం’

ఎలాంటి స‌మాచారం లేకుండా ముఖ్య‌మంత్రి హోదాలో ఎవ‌రూ మాట్లాడ‌రు. మ‌రీ ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకుని వ్యాఖ్యానిస్తాడు. త‌ల‌పండిన రాజ‌కీయవేత్త‌గా, ఉద్య‌మ‌కారునిగా ఆయ‌న‌కు పేరుంది. క్రిస్మ‌స్ వేడుక‌ల్లో మ‌త క‌ల‌హాల‌ గురించి ఆయ‌న ప్ర‌స్తావించాడు

  • Written By:
  • Updated On - December 22, 2021 / 12:56 PM IST

ఎలాంటి స‌మాచారం లేకుండా ముఖ్య‌మంత్రి హోదాలో ఎవ‌రూ మాట్లాడ‌రు. మ‌రీ ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకుని వ్యాఖ్యానిస్తాడు. త‌ల‌పండిన రాజ‌కీయవేత్త‌గా, ఉద్య‌మ‌కారునిగా ఆయ‌న‌కు పేరుంది. క్రిస్మ‌స్ వేడుక‌ల్లో మ‌త క‌ల‌హాల‌ గురించి ఆయ‌న ప్ర‌స్తావించాడు. అంటే, నిఘా వ‌ర్గాలు స‌మాచారం ఇవ్వ‌కుండా ఆ విధంగా ఆయ‌న మాట్లాడ‌రు. ఒక వేళ ఎలాంటి సంకేతాలు నిఘా వ‌ర్గాల నుంచి లేకుండా సీఎం హోదాలో మ‌త విద్వేషం అంశాన్ని పొలిటిక‌ల్ మైండ్ గేమ్ కింద తీసుకుంటే పొర‌బాటే.వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ ప‌నిచేస్తోంది. తెలంగాణ గ‌డ్డ‌పై క‌షాయ జెండా ఎగ‌రాల‌ని ఢిల్లీ పెద్ద‌లు తెగేసి చెప్పారు. ఆ క్ర‌మంలో తెలంగాణ బీజేపీ నేతలు దూకుడుగా వెళుతున్నారు. దుబ్బాక‌, గ్రేట‌ర్‌, హుజారాబాద్ ఫ‌లితాలు ఆ పార్టీకి కొండంత బ‌లాన్ని ఇచ్చాయి. నాగార్జున సాగ‌ర్‌, హుజూర్ న‌గ‌ర్‌, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో డిపాజిట్లు రాక‌పోయిన‌ప్ప‌టికీ క‌మ‌ల నాథులు ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు. ఉత్త‌ర తెలంగాణ,హైద్రాబాద్ ప్రాంతాల్లో ఆ పార్టీ బలంగా ఉంది. ద‌క్షిణ తెలంగాణ మీద ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టారు. ఆ విష‌యాన్ని నిఘా వ‌ర్గాలు సీఎం కేసీఆర్ కి తెలియ‌చేసి ఉంటారు. అందుకే, రాజ‌కీయ గేమ్ ను కేసీఆర్ మొద‌లు పెట్టాడ‌ని టాక్.

వ‌రి ధాన్యం కొనుగోలు అంశాన్ని కేసీఆర్ సీరియ‌స్ గా తీసుకున్నాడు. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఆ ఇష్యూని తీసుకెళ్లాడు. కేంద్రాన్ని బద్నాం చేయాల‌ని ప్ర‌ణాళిక‌ను ర‌చించాడు. తెలంగాణ భ‌వ‌న్లో జ‌రిగిన ఎమ్యెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధుల స‌మావేశంలో దిశానిర్దేశం చేశాడు. బీజేపీని టార్గెట్ గా చేసుకుని దీర్ఘ‌కాలిక పోరాటాలు చేయాల‌ని ఆదేశించాడు. ఆ మేర‌కు మంత్రులు అంద‌రూ ఢిల్లీ వెళ్లారు.వ‌రి ధాన్యం కొనుగోలు గురించి తేల్చాల‌ని కేంద్రంపై మంత్రులు ఒత్తిడి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కేంద్ర మంత్రి పియూష్ నేరుగా టీఆర్ఎస్ మంత్రుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఆరోప‌ణ‌ల‌కు దిగారు. వ‌రి ధాన్యం ఎంత పండించిన కొనుగోలు చేస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ టీఆర్ఎస్ రాజ‌కీయం చేస్తోంద‌ని మండిప‌డ్డాడు. అంతేకాదు, ఒప్పందం ప్ర‌కారం ఇంకా 25లక్ష‌ల ట‌న్నుల బియ్యం కేంద్రానికి ఇవ్వాల‌ని చెబుతున్నాడు. దీంతో టీఆర్ఎస్ డైల‌మాలో ప‌డింది.

ఢిల్లీలో మంత్రులు ఉన్న స‌మ‌యంలోనే బీజేపీ తెలంగాణ నేత‌లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను క‌లిశారు. టీఆర్ఎస్ పార్టీతో తాడోపేడో తేల్చుకోవాల‌ని దిశానిర్దేశం చేశాడు. ఇప్ప‌టికే అగ్రెసివ్ గా వెళుతోన్న తెలంగాణ బీజేపీ లీడ‌ర్ల‌కు షా ఇచ్చిన డైరెక్ష‌న్ మ‌రింత ఊపునిచ్చింది. క్షేత్ర స్థాయిలో పోరాటానికి సిద్ధం కావ‌డానికి రెడీ అవుతున్నారు. ఆ క్ర‌మంలో మ‌త విద్వేషాల‌ను బీజేపీ రెచ్చ‌గొట్టేందుకు అవ‌కాశం ఉంద‌ని సీఎం కేసీఆర్ అనుమానించి ఉండొచ్చు. అందుకే, క్రిస్మ‌స్ వేడుక‌ల్లో విద్వేషాల‌ను సహించ‌మ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. సో..నిప్పులేనిదే పొగ‌రాద‌న్న‌ట్టు..మ‌త విద్వేషాల గురించి కేసీఆర్ ప్ర‌స్తావించారంటే, ఏవో సంకేతాలు ఆయ‌న‌కు ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు.