Site icon HashtagU Telugu

TRS Vs TDP : ‘బాబు’ మా బంగారం!

Shocking

Kcr Babu

`రాజ‌కీయాల్లో శ‌త్రువులు ఉండ‌రు, ప్ర‌త్య‌ర్థులు మాత్ర‌మే ఉంటారు` అంటూ తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడి జ‌పం టీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవ‌ల ప‌లు సంద‌ర్భాల్లో చంద్ర‌బాబు విజ‌న్ ను కొనియాడారు. ఆనాడు ఆయ‌న వేసిన ఐటీ బీజాలు ఇవాళ ఫ‌లితాల‌ను ఇస్తున్నాయ‌ని ప్ర‌శంసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో గ‌త ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకున్నందు వ‌ల్ల బాబును రాజ‌కీయ శ‌త్రువుగా ఆనాడు చూశామ‌ని ప‌రోక్షంగా లెంప‌లు వేసుకున్నారు. కానీ, రాజ‌కీయాల్లో శ‌త్రువులు ఎవ‌రికీ శాశ్వ‌తంగా ఉండ‌ర‌ని, కేవ‌లం ప్ర‌త్య‌ర్థులు మాత్ర‌మే ఉంటార‌ని స‌రికొత్త టాగ్ ను కేటీఆర్ ఆయ‌న ప్ర‌సంగానికి త‌గిలించారు.

ఇటీవ‌ల బెంగుళూరు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చంద్ర‌బాబు గురించి సానుకూల వ్యాఖ్య‌లు చేశారు. జాతీయ రాజ‌కీయాల కోసం జేడీఎస్ నేత‌ల‌ను క‌ల‌వ‌డానికి వెళ్లిన ఆయ‌న‌కు బాబు గురించి ప్ర‌స్తావించాల్సిన అనివార్య ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ను క‌లిసిన త‌రువాత మీడియాలో ఆనాడు కేసీఆర్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్ర‌బాబు మ‌ద్ధ‌తు లేకుండా జాతీయ రాజ‌కీయాలు మీకు సాధ్య‌మా? అంటూ విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు కేసీఆర్ చాలా హుందాగా స‌మాధానం ఇచ్చారు. సాన్నిహిత సంబంధాలు చంద్ర‌బాబుతో ఉన్నాయ‌ని చెప్పుకొచ్చారు. అవ‌స‌ర‌మైతే, ఇద్ద‌రం క‌లిసి జాతీయ రాజ‌కీయాల‌ను న‌డిపేందుకు సిద్ధ‌మ‌నే సంకేతాల‌ను ప‌రోక్షంగా బెంగుళూరు కేంద్రంగా ఇచ్చారు. ఇదంతా రాబోవు ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్రంలో గెల‌వ‌డానికి టీఆర్ఎస్ పార్టీ వేస్తోన్న ఎత్తుగ‌డ‌లుగా భావించాల్సి ఉంటుంది.

తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క‌ర్ణాట‌క కేంద్రంగా `రెడ్డి` సామాజిక‌వ‌ర్గానికి రాజ్యాధికారం ఉండాల‌ని చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను మార్చే అవ‌కాశం లేక‌పోలేదు. ఆ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన కేసీఆర్ ముందు నుంచే బ‌ల‌మైన క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఓట్ల కోసం ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు. అందులో భాగంగా విలువైన మూడు ఎక‌రాల భూమిని క‌మ్మ సంఘం కోసం హైటెక్స్ వ‌ద్ద తెలంగాణ సీఎం కేసీఆర్ కేటాయించారు. అంతేకాదు, దాని నిర్మాణం కోసం ఉడ‌తాభ‌క్తిగా కొన్ని నిధుల‌ను కూడా స‌మ‌కూర్చుతున్నార‌ని టాక్‌. 2019 ఎన్నిక‌ల్లో `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం పార్టీల‌కు అతీతంగా ఏపీలో ఒక‌టిగా పోరాడింది. ఫ‌లితంగా ఆ రాష్ట్రంలో రాజ్యాధికారం జ‌గ‌న్ రూపంలో పొందింది. సేమ్ టూ సేమ్ అలాంటి స‌మీక‌ర‌ణ `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం రూపంలో తెలంగాణ‌లోనూ క‌నిపిస్తోంది. వ‌చ్చే 2023 ఎన్నిక‌ల నాటికి `రెడ్డి`ల‌కు రాజ్యాధికారం ఉండాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బాహాటంగా ప్ర‌క‌టించారు. దీంతో ఇప్ప‌టికే ఆ సామాజిక‌వ‌ర్గం తెలంగాణ గ‌ల్లీ నుంచి అమెరికా వ‌ర‌కు ఏకం అయ్యేలా చాప‌కింద నీరులా ప‌నిచేస్తోంది.

మంత్రి మ‌ల్లారెడ్డిని ఆయ‌న సామాజిక‌వ‌ర్గం ఊరికించి కొట్టారు. ఆ ప‌రిణామం చూసిన త‌రువాత 2019 ఎన్నిక‌ల్లో ఏపీలోని జ‌రిగిన రాజ‌కీయ ప‌రిస్థితులు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు తెలంగాణ‌లో క‌నిపిస్తోంది. పైగా ఏపీ కంటే తెలంగాణ రెడ్డి సామాజిక‌వ‌ర్గం తొలి నుంచి రాజ‌కీయంగా చాలా ప్రాబ‌ల్యం క‌లిగి ఉంది. ప‌టేల్‌, ప‌ట్వారీ వ్య‌వ‌స్థ నుంచి ఆ సామాజిక వ‌ర్గం గ్రామాల‌పై ద‌శాబ్దాల పాటు పెత్త‌నం చేసింది. అలాంటి పెత్త‌నం కోసం వెల‌మ సామాజిక‌వ‌ర్గం ప్ర‌య‌త్నం చేసి తెలంగాణ వ్యాప్తంగా వైఫ‌ల్యం చెందింది. ఆ విష‌యాన్ని రేవంత్ రెడ్డి క‌ర్ణాట‌క కేంద్రంగా గుర్తు చేసిన విష‌యం విదిత‌మే. అంతేకాదు, కాక‌తీయ సామ్రాజ్యం చ‌రిత్ర‌ను బ‌య‌ట‌కు తోడిన రేవంత్ రెడ్డి తొలి నుంచి వెల‌మ‌, రెడ్డి కులాలు శ‌త్రువులంటూ నిన‌దించారు. దీంతో అనివార్యంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక‌వ‌ర్గం నాయ‌కులు కూడా ఎక్కువ మంది వ‌చ్చే ఎన్నిక‌ల్లో సైలెంట్ అయ్యే అవ‌కాశం లేక‌పోలేదు.

బ‌ల‌మైన కాంగ్రెస్ పార్టీ ఎత్తుగ‌డ‌ను తిప్పికొట్టే క్ర‌మంలో తాజాగా టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చంద్ర‌బాబు జ‌పం చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తోంది. మునుపెన్న‌డూ లేనివిధంగా స్వ‌ర్గీయ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు టీఆర్ఎస్ నేత‌లు క్యూ క‌ట్టారు. అంతేకాదు, ఎన్టీఆర్ కు భార‌త ర‌త్న అవార్డ్ ఇవ్వాల‌ని డిమాండ్ ను తెర‌మీద‌కు తీసుకొచ్చారు. బ‌హుశా కేసీఆర్ వినిపిస్తోన్న జాతీయ విధానంలో ఇది కూడా ఒక నినాదంగా ఉండొచ్చు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చ‌గొట్టి రెండుసార్లు సీఎంగా అయిన కేసీఆర్ ఈసారి జాతీయ వాదాన్ని, స‌మైక్య‌వాదాన్ని వినిపిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఆయన్ను ఎవ‌రూ పెద్ద‌గా విశ్వసించ‌డంలేదు. ఫ‌లితంగా ఆయ‌న రెండుమూడుసార్లు ఢిల్లీ వెళ్లిన‌ప్ప‌టికీ అర్థాంత‌రంగా వెనుక‌తిరిగారు.

స‌మైక్య‌వాదాన్ని, జాతీయ వాదాన్ని వినిపిస్తోన్న కేసీఆర్ తాజాగా చంద్ర‌బాబు గురించి సానుకూలంగా బెంగుళూరు కేంద్రంగా స్పందించారు. దావోస్ నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కు మంత్రి కేటీఆర్ తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్ర‌బాబును కొనియాడుతున్నారు. అంతేకాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న గురించి ఇటీవ‌ల విమ‌ర్శించారు కేటీఆర్. ఏపీలోని రోడ్లు, విద్యుత్ దారుణ ప‌రిస్థితుల గురించి కేసీఆర్ కామెంట్ చేశారు. అసెంబ్లీ వేదిక‌గా ఏపీ వెనుక‌బాటుతనాన్ని సీఎం కేసీఆర్ ఎత్తిచూపారు. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే, చంద్ర‌బాబునాయుడు ప్ర‌స‌న్నం కోసం టీఆర్ఎస్ అధిష్టానం అర్రులు చాస్తున్న‌ట్టు అర్థం అవుతోంది. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు అనేదానికి ఇలాంటి ప‌రిణామాలు ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం.!