TRS Delhi Protest:ఢిల్లీలో కేసీఆర్ దీక్ష… సభ విశేషాలు ఇవే

తెలంగాణ వరి సమస్య ఢిల్లీకి చేరింది.

తెలంగాణ వరి సమస్య ఢిల్లీకి చేరింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా రాష్ట్ర మంత్రివర్గం, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ‘మహా ధర్నా’కు దిగడం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చే అవకాశముంది. దేశ రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో ప్రదర్శన నిర్వహించడం దాదాపు ఇదే మొదటిసారి.

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రానికి ఒకే పాలసీ ఉండాలని డిమాండ్ చేస్తున్న ఈ మహాధర్నాలో కేసీఆర్ కు మద్దతుగా పలు రాష్ట్రాల రాజకీయ నాయకులూ మద్దతు తెలిపే అవకాశముంది. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఈ నిరసన సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పార్టీ నేతలు తెలిపారు. సభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలతో పాటు తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశామని, అమరులకు నివాళులు అర్పించి ధర్నా మొదలుపెడుతామని నిర్వాహకులు తెలిపారు.

టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన దాదాపు 1500 మంది ప్రజాప్రతినిధులకు ముందు వరుసలో సీట్లను ఏర్పాటు చేసారు. ముఖ్యమంత్రితో పాటు, క్యాబినెట్ మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు కూర్చోవడానికి 40 అడుగుల డయాస్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనేక మంది టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు విమానాలు, రైళ్లలో ఢిల్లీ చేరుకున్నారు. ఈ ప్రదర్శనలో టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ఇతర ప్రజా సంఘాలకు చెందిన నాయకులు పాల్గొననున్నారు. రద్దు చేయబడ్డ వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనల తర్వాత రైతు సమస్యల కోసం జరుగుతున్న సభ కాబట్టి చాలా సంస్థలు ఈ ధర్నాకు ఇప్పటికే తమ మద్దతును ప్రకటించాయి.

సభ ప్రాంగణంతో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ జెండాలే కాకుండా చంద్రశేఖర్‌రావు, రామారావు, మంత్రులు తదితరుల ఫ్లెక్స్‌ బోర్డులు, కటౌట్‌లతో వీధులన్నీ గులాబీమయంగా మారాయి. ‘ఒకే దేశం, ఒకే వరి సేకరణ’ విధానం ‘కేంద్ర ప్రభుత్వం రైతుల ఆకాంక్షను కాపాడాలి’ వంటి పంచ్‌లైన్‌లతో పార్లమెంటు సమీపంలో 150కి పైగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేసారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న వివక్షాపూరిత విధానాన్ని ప్రశ్నిస్తున్న నినాదాలు, రైతుల పోస్టర్లు ఇంగ్లీషు, హిందీ భాషల్లో కూడా ఏర్పాటు చేసారు.

వరి సేకరణ, నిధుల కేటాయింపు తదితర అంశాల్లో తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను బహిర్గతం చేయడంతో పాటు, రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై గళమెత్తేందుకు టీఆర్‌ఎస్ కార్యాచరణ ప్రణాళికనుఈ వేదికపై ప్రకటించే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులకు లాభదాయకమైన ఆదాయం, దేశాభివృద్ది వంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించకుండా మతం, ప్రాంతం, భాష, సంస్కృతి పేరుతో విభజన రాజకీయాలు చేస్తోన్న బీజేపీ తీరును ఢిల్లీ వేదికగా ఎండగట్టాలని టీఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.