Telangana Politics : ఒకే వేదిక‌పైకి కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం!

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ ఏకం కాబోతున్నాయా? రాహుల్ వ‌రంగల్ స‌భ‌లో చెప్పిన మాట‌లు ఉత్త‌దేనా?

  • Written By:
  • Updated On - June 25, 2022 / 02:08 PM IST

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ ఏకం కాబోతున్నాయా? రాహుల్ వ‌రంగల్ స‌భ‌లో చెప్పిన మాట‌లు ఉత్త‌దేనా? అవ‌స‌రానికి అనుగుణంగా ఆ రెండు పార్టీలు క‌లిసి ప‌నిచేస్తాయా? అంటే ఔను అనే స‌మాధానం వ‌స్తుంది. ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు క‌లిసి య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ధ‌తు ఇవ్వ‌నున్నాయి. అంతేకాదు, స‌హ‌జ మిత్రునిగా ఉన్న ఎంఐఎం కూడా ఆ రెండు పార్టీ జ‌త‌న చేర‌నుంది. ఇదే ఈక్వేష‌న్ రాబోవు ఎన్నిక‌ల్లో కూడా కొన‌సాగే అవ‌కాశం ఉందా? అనే ప్ర‌శ్న ఇప్పుడు తలెత్తుతోంది.

విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా సిన్హాను ఢిల్లీ కేంద్రంగా ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. సుమారు 22 పార్టీలు క‌లిసి మ‌మ‌త ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మావేశంలో సిన్హా అభ్య‌ర్థిత్వాన్ని ఆమోదించారు. తొలుత శ‌ర‌ద్ ప‌వార్, ఫ‌రూక్ అబ్దుల్లా పేర్ల‌ను ప‌రిశీలించిన‌ప్ప‌టికీ వాళ్లు సున్నితంగా తిర‌స్కరించారు. దీంతో తృణ‌మూల్ కాంగ్రెస్ ఉపాధ్య‌క్షునిగా ఉన్న య‌శ్వంత్ సిన్హా ను విప‌క్షాల ఉమ్మ‌డి అభ్యర్థిగా ప్ర‌క‌టించారు. ఆ స‌మావేశానికి టీఆర్ఎస్ దూరంగా ఉన్న‌ప్ప‌టికీ సిన్హాకు మ‌ద్ధ‌తు ఇస్తామ‌ని సూత్ర‌ప్రాయంగా కేసీఆర్ వెల్ల‌డించారు. ఫోన్ ద్వారా సంప్ర‌దించిన‌ప్పుడు సిన్హాకు మ‌ద్ధ‌తు ఇస్తాన‌ని కేసీఆర్ హామీ ఇచ్చిన‌ట్టు శ‌ర‌ద్ ప‌వార్ మీడియాకు చెప్పారు. ఇక లాంఛ‌నంగా సిన్హాను ఆహ్వానించి అధికారికంగా మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించ‌డ‌మే టీఆర్ఎస్ ముందున్న ఎత్తుగ‌డ‌.

జాతీయ పార్టీని ప్ర‌క‌టించ‌డానికి సన్నాహాలు చేస్తోన్న కేసీఆర్ ఇటీవ‌ల స్లో అయ్యారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల కార‌ణంగా మాత్ర‌మే బీఆర్ఎస్ పార్టీ ప్ర‌క‌ట‌న జాప్యం కానుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌గ‌తిభ‌వ‌న్ కేంద్రంగా వివిధ రంగాల మేధావులు, ఆర్థిక వేత్త‌లు, ప్ర‌ముఖుల‌తో కేసీఆర్ చ‌ర్చిస్తున్నార‌ని చెబుతున్నారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్ కీల‌క రోల్ పోషిస్తోంద‌ని భావిస్తున్నారు. అందుకే, ఈనెల 27వ తేదీ నామినేష‌న్ దాఖ‌లు చేసిన తరువాత సిన్హాను హైద‌రాబాద్ కు రానున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మ‌ద్ధ‌తును ఆయ‌న కోర‌నున్నారు. దీంతో ద్రౌప‌ది ముర్ము దాదాపు హైద‌రాబాద్ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది.

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారానికి నగరానికి రానున్న‌ ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్‌ఎస్ ఘనంగా స్వాగతం పలకనుంది. జూన్ 27న నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ప్రచారం కోసం సిన్హా వివిధ రాష్ట్రాలకు వెళ్లనున్నారు. సిన్హా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం శాసనసభ్యులను వేర్వేరుగా కలుస్తూ ఓట్లు వేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 103 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలు ఉన్న టీఆర్‌ఎస్ సిన్హాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించడంతో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో ప్రచారం చేయడంపై అనిశ్చితి నెలకొంది. ఏఐఎంఐఎంకు తెలంగాణలో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, మహారాష్ట్ర, బీహార్‌లో మరో ఎంపీ, అర డజనుకు పైగా శాసనసభ్యులు ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఇద్దరూ ఎన్డీయేకు వ్యతిరేకమే. రాష్ట్రంలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు ఉన్నారు.

2017 రాష్ట్రపతి ఎన్నికలలో, NDA రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్‌లో ప్రచారం చేశారు. ఎందుకంటే TRS, NDAకి మద్దతు ఇచ్చింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు, ఆయన మంత్రివర్గ సహచరులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరై కోవింద్‌కు టీఆర్‌ఎస్ భారీ స్వాగతాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష పార్టీలు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను రాష్ట్రపతి ఎన్నికలకు పోటీకి నిలబెట్టాయి, అయితే టిఆర్‌ఎస్ ఎన్‌డిఎకు మద్దతు ఇవ్వడంతో కేసీఆర్‌ ఆమెను కలవడానికి నిరాకరించారు. అయితే, యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్నట్లు టీఆర్‌ఎస్ అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అయిన జూన్ 29 లోగా ఆయన ఈ అంశంపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద దేశ వ్యాప్తంగా మారిన ప‌రిణామాల దృష్ట్యా విప‌క్షాల అభ్య‌ర్థిగా ఉన్న సిన్హాకు తెలంగాణ వేదిక‌పై కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం ఐక్యంగా మ‌ద్ధ‌తు ఇవ్వడానికి అవ‌కాశం ఉంది. ఇలాంటి క‌ల‌యిక‌ను చూసిన త‌రువాత రాబోవు ఎన్నిక‌ల్లో కూడా ఇదే ఈక్వేష‌న్ ఉంటుందా? అనే అనుమానాలు బ‌య‌లుదేర‌డం స‌హ‌జం. వాటికి భ‌విష్య‌త్ మాత్ర‌మే సమాధానం చెప్ప‌గ‌ల‌దు.