Political Fight: తెలంగాణలో ‘పొలిటికల్’ హీట్!

పది రోజుల వ్యవధిలో కాంగ్రెస్, బీజేపీల జాతీయ స్థాయి నేతలు తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కించింది.

  • Written By:
  • Updated On - May 4, 2022 / 01:21 PM IST

 టీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని పది రోజుల వ్యవధిలో కాంగ్రెస్, బీజేపీల జాతీయ స్థాయి నేతలు తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కించింది. మే 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒకరోజు ముందుగానే అంటే మే 5న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, మే 14న హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను ఎత్తిచూపేందుకు వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. అంతేకాదు.. నిరుద్యోగాన్ని ఎత్తిచూపేందుకు ఉస్మానియా యూనివర్సిటీని సైతం విజిట్ చేయనున్నారు. కాగా మరోవైపు టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న విషయం విధితమే. అయితే ఆయన పాదయాత్రకు మద్దతుగా, టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు మహబూబ్‌నగర్‌ కు బీజేపీ చీఫ్ నడ్డా,  హోం మంత్రి షా  ‘పాదయాత్ర’ ముగింపునకు కోసం హైదరాబాద్ శివారులోని మహేశ్వరంలో బహిరంగ సభలో ప్రసంగించే అవకాశాలున్నాయి.

రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం తదితరాలపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక ఆరోపణలను ఎదుర్కోవడానికి, టీఆర్‌ఎస్ నాయకత్వం అన్ని జిల్లాల్లో తమ శ్రేణులను సంసిద్ధం చేసింది. రైతులు, నిరుద్యోగులు, ఇతర వర్గాల ప్రయోజనాల కోసం ఎనిమిదేళ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై బీజేపీ, కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైపల్యాలను ఎండగడుతూ ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా, మండల స్థాయి నేతలంతా ఎదురుదాడి చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.

రాహుల్ తెలంగాణ పర్యటనలో నేపథ్యంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తమ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్యలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణలకు జిల్లా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కేటీఆర్ గట్టిగా బదులిచ్చేందుకు స్రిప్ట్ ను రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఏడేళ్లలో 1.36 లక్షల ఉద్యోగాల భర్తీ, ఇటీవల ప్రకటించిన 90,000 పోస్టుల భర్తీకి గ్రూప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని నిరూపించేందుకు కేటీఆర్ ఓ రిపోర్ట్ విడుదల చేయనున్నారు.