Site icon HashtagU Telugu

Telangana: కేంద్రం తీరుకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ నిరసనలు

వరి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్రం అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ నిరసనలు చేయనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఓ వైపు మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసేందుకు దిల్లీకి వెళ్లగా… మరోవైపు గ్రామగ్రామానా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఇవాళ ఊరూరా చావుడప్పు, ర్యాలీలతో ఆందోళన చేసేందుకు గులాబీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. భాజపా మోసాలు, నాటకాలు ప్రజలకు తెలిసేలా నిరసనలు సాగాలని మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులకు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా కేటీఆర్ పిలుపునిచ్చారు.

ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాసినా, కేంద్రమంత్రులను కోరినా, పార్లమెంటులో నిరసన తెలిపినా.. కేంద్రం నుంచి స్పందన లేదని కేటీఆర్‌ విమర్శించారు. కేంద్రం దిగివచ్చే వరకూ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కోటి సంతకాలు సేకరించి పంపుతామని పేర్కొన్నారు. రైతులను చైతన్యపరిచి ఉద్యమస్ఫూర్తిలో నిరసనలు సాగించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

కేంద్రం అస్పష్టమైన విధానాలతో గందరగోళం సృష్టిస్తూ… రైతులను అయోమయానికి గురిచేస్తోందని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు.
గులాబీ పోరుకు లారీ యజమానుల సంఘం మద్దతు ప్రకటిస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి లేఖ అందించారు. లారీ యజమానులు తమ తమ ప్రాంతాల్లో ఆందోళనల్లో పాల్గొనాలని సంఘం పిలుపునిచ్చింది.

Exit mobile version