Site icon HashtagU Telugu

TRS Plenary : ‘జ‌గ‌న్’ టార్గెట్ గా టీఆర్ఎస్ ప్లీన‌రీ

Jagan Kcr

Jagan Kcr

ఏపీ విద్యుత్ కోత‌ల‌పై టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ‌ సీఎం కేసీఆర్ వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. అంధ‌కారంలోకి ఏపీ వెళ్లిపోయింద‌ని విమ‌ర్శించారు. వెలుగు జిలుగుల‌తో తెలంగాణ మ‌ణిదీపంలా వెలిగిపోతుంద‌ని అన్నారు. తెలంగాణ స‌రిహ‌ద్దుల్లోని మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, చ‌త్తీస్ గ‌డ్ చివ‌ర‌కు ఏపీ అంటూ మిగిలిన రాష్ట్రాల కంటే దారుణంగా ఏపీ ఉంద‌ని ప‌రోక్షంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. గ‌తంలోనూ అసెంబ్లీ వేదిక‌గా ప‌లుమార్లు ఏపీ అభివృద్ధి, అమ‌రావ‌తి ప్రాజెక్టు గురించి ప్ర‌స్తావించారు. ఏపీ వెనుక‌బాటుత‌నాన్ని త‌ర‌చూ కేసీఆర్ గుర్తు చేస్తున్నారు. ప‌లు వేదిక‌ల‌పై ఏపీ ప‌రిస్థితులను వివ‌రిస్తూ ఆయ‌న చేసిన‌ అభివృద్ధిని చూపుతున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ ప్రాంతంలో ఒక ఎక‌రం అమ్ముకుంటే ఏపీలో మూడు ఎక‌రాలు వ‌స్తుంద‌ని అసెంబ్లీ వేదిక‌గా ప‌లుమార్లు చెప్పారు. ఒక‌ప్పుడు ఏపీలో ఒక ఎక‌రం అమ్ముకుంటే తెలంగాణ‌లో మూడు ఎక‌రాలు వ‌చ్చేద‌ని పోల్చారు.

ఏపీలో ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ హాలిడే న‌డుస్తోంది. ఆ విష‌యాన్ని గుర్తు చేసిన కేసీఆర్ ఆ రాష్ట్రం దౌర్భాగ్యాన్ని ల‌క్ష‌ల మంది పాల్గొన్న ప్లీన‌రీలో ప్ర‌స్తావించారు. తెలంగాణ ప్ర‌జ‌లను ఆలోచింప చేసేలా ఏపీ రాష్ట్రంతో అభివృద్ధిని పోల్చుతూ మూడోసారి సీఎం కావాల‌ని కేసీఆర్ బాటలు వేసుకుంటున్నారు. రాష్ట్రం విడిపోక ముందు విద్యుత్ కోత‌లు ఉండేవి. ఉమ్మ‌డి ఏపీ విడిపోతే, తెలంగాణ అంధ‌కారం అవుతుంద‌ని మాజీ సీఎంలు చెప్పారు. కానీ, ఇవాళ తెలంగాణ వెలిగిపోతుంద‌ని గుర్తు చేశారు.

అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాజెక్టు ఫెయిల్ కావ‌డంతో తెలంగాణ అభివృద్ధి ప‌రుగుపెడుతుంద‌ని మంత్రి హ‌రీశ్ ఒక స‌మ్మిట్ లో ఇటీవ‌ల ప్ర‌స్తావించారు. ప‌రిశ్ర‌మ‌లు ఏపీకి వెళ్ల‌కుండా తెలంగాణ‌కు తీసుకు వ‌స్తున్న మంత్రి కేటీఆర్ ప‌లుమార్లు ఏపీలోని దారుణ ప‌రిస్థితుల‌ను గుర్తు చేశారు. ఏపీ ప‌రిస్థితులు తెలంగాణ‌కు అనుకూలంగా ఉన్నాయ‌ని ప‌లు వేదిక‌ల‌పై పోల్చారు. ఇప్పుడు ప్లీన‌రీ వేదిక‌గా కేసీఆర్ ఏపీ వెనుక‌బాటు తనాన్ని వెలుగెత్తి చాటారు. మంచినీళ్లు కూడా ఇవ్వ‌లేని ఆంధ్రా పాల‌కుల నుంచి ప్ర‌తి ఇంటికి నీటి కుళాయి ఏర్పాటు చేసుకునే స్థాయికి వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. ఇదే క‌దా, అభివృద్ధి అంటే అంటూనే ఏపీ వెనుక‌బాటు త‌నాన్ని గీటురాయిగా తీసుకుని తెలంగాణ ప్ర‌గ‌తిని పోల్చ‌డం ప్లీన‌రీలోని హైలెట్ పాయింట్‌.