TRS MPs: ఢిల్లీ టూ గ‌ల్లీ.. కాడికిందేసిన టీఆర్ఎస్ ఎంపీలు!

ఏదైనా స‌మ‌స్య వ‌స్తే ప‌రిష్కారం కోసం ప్ర‌భుత్వాలపై పోరాటం చేయ‌డం స‌హ‌జం. కానీ, వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం మోడీ స‌ర్కార్ ను ఏ మాత్రం ఆలోచింప చేయ‌లేక‌పోయింది.

  • Written By:
  • Updated On - December 9, 2021 / 04:36 PM IST

ఏదైనా స‌మ‌స్య వ‌స్తే ప‌రిష్కారం కోసం ప్ర‌భుత్వాలపై పోరాటం చేయ‌డం స‌హ‌జం. కానీ, వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం మోడీ స‌ర్కార్ ను ఏ మాత్రం ఆలోచింప చేయ‌లేక‌పోయింది. వారం రోజులుగా ప్ల కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించి నామ‌మాత్ర‌పు నిర‌స‌న వ్య‌క్తం చేసిన ఎంపీలు హైద‌రాబాద్ బాట ప‌ట్టారు. ఆ విష‌యాన్ని రెండు రోజుల క్రిత‌మే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.
హుజ‌రాబాద్ ఉప ఫ‌లితాల త‌రువాత వ‌రి కొనుగోలు అంశం సీరియ‌స్ గా తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆ అంశం బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ ను తీసుకొచ్చింది. పోటాపోటీగా ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేసి త‌ప్పు మాదిక‌దంటే మాదికాదంటూ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లారు. ప‌ర‌స్స‌రం స‌వాళ్లు, బూతులు తిట్టుకున్నారు. పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లోనే తేల్చుకుంటామంటూ స‌మ‌స్య‌ను ఢిల్లీకి చేర్చారు. సీన్ క‌ట్ చేస్తే…టీఆర్ఎస్ ఎంపీలు ఏమీ చేయ‌లేక తిరుగు ప‌య‌నం అయ్యారు.
పార్ల‌మెంట్ వేదిక‌గా కేంద్రం మంత్రి పియూష్ గోయెల్ చాలా స్ప‌ష్టంగా వ‌రి ధాన్యం కొనుగోలు అంశాన్ని వెల్ల‌డించాడు. ఎంత పండించిన‌ప్ప‌టికీ కొనుగోలు చేస్తామ‌ని తెగేసి చెప్పాడు. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన మాట‌లు అబ‌ద్ధ‌మ‌ని రైతులు న‌మ్మ‌డం ప్రారంభించారు. ఆ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన టీఆర్ఎస్ లీడ‌ర్లు కేంద్ర ప్ర‌భుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిని టార్గెట్ చేయ‌డం ద్వారా తెలంగాణ రాజ‌కీయాన్ని కేసీఆర్ ర‌క్తి క‌ట్టించాడు.
కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య జ‌రిగిన ఒప్పందాల ప్ర‌కారం కేసీఆర్ స‌ర్కార్ వ‌రి ధాన్యం కొనుగోలు చేయాలి. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు 32శాతం మేర‌కు మాత్ర‌మే కొనుగోలు చేసిన తెలంగాణ స‌ర్కార్ రైతుల‌ను న‌ట్టేట ముంచింది. ఫ‌లితంగా సుమారు 700పైగా రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. పండించిన పంట‌ను అమ్ముకోలేక అనేక మంది రైతులు నానా యాత‌న ప‌డుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వాలు త‌ప్పు మాది కాదంటే..మాది కాదు..అంటూ రాజ‌కీయాన్ని ర‌స‌వ‌త్త‌రం చేయ‌డం శోచ‌నీయం.
తెలంగాణ స‌ర్కార్‌కు ఇచ్చిన ఒప్పందం ప్ర‌కారం రా రైస్, బాయిల్డ్ రైస్ ను పూర్తిగా కొనుగోలు చేస్తామ‌ని పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్రం చెబుతోంది. తెలంగాణ‌ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కూడా అదే చెబుతున్నాడు. రైతుల‌కు కేంద్రం అన్యాయం చేయ‌ద‌ని భ‌రోసా ఇస్తున్నాడు. రాష్ట్ర ప్ర‌భుత్వం బాధ్య‌తకు వ్య‌వ‌హ‌రించాల‌ని కోరుతున్నాడు. రైతుల వ‌ద్ద ఉన్న మొత్తం ధాన్యాన్ని కేసీఆర్ స‌ర్కార్ కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాడు. కొనుగోళ్లపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, ఇప్పుడు దాన్ని పెను సమస్యగా సృష్టించే ప్ర‌య‌త్నం మానుకోవాల‌ని కేసీఆర్ కు హిత‌వు ప‌లికాడు.
వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో త‌ప్పు ఎవ‌రిదో తేల్చుకోవ‌డానికి చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని వారం క్రితం కేసీఆర్ స‌వాల్ విసిరాడు. నేరుగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని ఛాలెంజ్ చేశాడు. బూతులు వాడ‌కుండా చ‌ర్చ‌కు వ‌స్తే..సిద్ధ‌మ‌ని కిష‌న్ రెడ్డి కూడా ప్ర‌తి స‌వాల్ చేశాడు. ఇలా..అటు కేంద్రం ఇటు రాష్ట్రం మ‌ధ్య వ‌రి ధాన్యం కొనుగోలు వ్య‌వ‌హారం రాజ‌కీయాన్ని సంత‌రించుకుంది. దీనికి పార్ల‌మెంట్ వేదిక‌గా ఫుల్ స్టాప్ ప‌డుతుంద‌ని రైతులు ఆశించారు. అక‌స్మాత్తుగా టీఆర్ఎస్ ఎంపీలు పార్ల‌మెంట్ ను బ‌హిష్క‌రించ‌డంతో స‌రికొత్త పొలిటిక‌ల్ వార్ కు కేసీఆర్ తెర‌తీస్తున్నాడు.
కిసాన్ బ‌చావో అంటూ వారం పాటు పార్ల‌మెంట్ లో నిన‌దించిన టీఆర్ఎస్ ఎంపీలు ఇప్పుడు భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అందుకు ప్ర‌తిగా క‌మ‌ల‌ద‌ళం కూడా రంగం సిద్ధం చేస్తోంది. కేసీఆర్ బచావో నినాదాన్ని అందుకోబోతుంది. ఈ రెండు పార్టీల న‌డుమ రాజ‌కీయం వ‌రి ధాన్యం కొనుగోలు మ‌రింత క‌ష్ట‌త‌రం కానుంది.