Site icon HashtagU Telugu

Kavitha: ఢిల్లీ అయినా, గల్లీ అయినా గొంతెత్తేది టీఆర్ఎస్ మాత్రమే!

Kavitha

Kavitha

టీఆర్ఎస్ పార్టీ సింహం లాంటింది.. తెలంగాణ ప్రజ‌ల గుండెల్లో గులాబీ పార్టీ రారాజుగా నిలిచిపోయింద‌ని ఆ పార్టీ ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముజిబుద్దీన్ గురువారం ప్రమాణ‌స్వీకారం చేశారు. ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల్లో జ‌రుగుతున్న అన్యాయాల‌ను ఎండ‌గడుతూ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, తెలంగాణ‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని లెక్కలతో స‌హా చెప్పి ప్రజ‌ల‌ను ముందుకు న‌డిపించారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని ప్రజ‌లు న‌మ్మి, వెంట న‌డిచారని, అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్‌ను రెండు సార్లు సీఎం చేశారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ 70 ల‌క్షల స‌భ్యతాల‌కు చేరుకుందని వెల్లడించారు.

కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఆస‌రా పెన్షన్లు, రైతుబంధు, రేష‌న్ బియ్యం లాంటి పథకాలు ఆగలేదని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల‌కు అన్నం పెడుతుంటే, మోదీ సున్నం పెడుతుండని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటర్లకు మీటర్లు పెడతామని మోదీ అంటే.. ఇక్కడ ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడుతలేరని విమర్శించారు. ఢిల్లీ అయినా, గల్లీ అయినా పేద ప్రజల తరపున గొంతెత్తేది టీఆర్‌ఎస్‌ మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు. ఏం చేస్తామో అదే చెప్పడం కేసీఆర్ నైజమని ఆమె పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలినప్పుడు.. మనం చేసిన అభివృద్ధి పనులను చెప్పి సమాధానం ఇవ్వాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న పనులను తెలుసుకోవాలని ఆమె సూచించారు.