MLC Kavitha: ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండుగ బతుకమ్మ!

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన 'బతుకమ్మ' పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్సీ కవిత.

  • Written By:
  • Publish Date - September 25, 2022 / 07:53 PM IST

రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన ‘బతుకమ్మ’ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్సీ కవిత. ఇంటిల్లిపాదీ ఏకమై, ఊరువాడ ఒక్కచోట చేరి రంగురంగుల పూలను పేర్చి ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండుగ బతుకమ్మ అని ఆమె కొనియాడారు. ఆదివారం నుండి తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను రాష్ట్ర పండుగగా అధికారికంగా ఘనంగా నిర్వహించడం మనందరికీ గర్వకారణం కవిత అన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ గారు పుట్టింటి కానుకగా కోటికి‌ పైగా చీరలను అందిస్తూ మహిళలకు గొప్ప గౌరవాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను కేవలం మన రాష్ట్రంలోనే గాక, దేశ విదేశాలలో ఉన్న తెలంగాణ బిడ్డలంతా వారి ప్రాంతంల్లో ఘనంగా నిర్వహిస్తూన్నారని చెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎనిమిది దేశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామని కవిత ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, ముంబై లాంటి కీలక నగరాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.