Site icon HashtagU Telugu

MLC Kavitha: ధర్మపురి కాదు.. అధర్మపురి అరవింద్!

Kavitha

Kavitha

పసుపు బోర్డు ఏర్పాటుపై ఉచిత సలహాలు, ఉత్తుత్తి మాటలతో టైంపాస్ చేస్తున్న ఎంపీ అరవింద్ ను వదిలే ప్రసక్తే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బుధవారం నిజామాబాద్ లో పర్యటించిన కవిత అరవింద్ పై తీవ్ర విమర్శలు చేశారు. గెలిచిన మూడేండ్లలో పసుపు రైతులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన అరవింద్ ను, 250 రూపాయల ఎంపీగా కవిత అభివర్ణించారు. పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తరో నిజమాబాద్ రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో రైతు సమస్యలకు రాజకీయ రంగుపులిమి, అనేక అబద్ధాలు చెప్పి, తప్పుడు హామీలు ఇచ్చి ఎంపీగా గెలిచారని, గడిచిన మూడేండ్లలో ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఎంపీ అరవింద్ సాధించిందేమీ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి పసుపు బోర్డు ఏర్పాటుపై గ్రామగ్రామాన అరవింద్ ను రైతులు నిలదీస్తారని హెచ్చరించారు.

ఉచిత సలహాలు, ఉత్తుత్తి మాటలు చెప్తూ టైంపాస్ చేస్తున్నారని కవిత మండిపడ్డారు. “తెలంగాణ వ్యాప్తంగా పసుపు రైతులకు గత మూడేండ్లలో ఎంపీ అరవింద్ కోటి 92 లక్షలు తెచ్చారని, అంటే ప్రతి రైతుకు కనీసం 250 రూపాయల లబ్ది కూడా జరగలేదు” అని కవిత గుర్తు చేశారు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా పంట దిగుబడి అద్భుతంగా ఉందని వెల్లడించారు. అయితే పండిన పంటను కేంద్రం కొనలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోందని ఆమె అన్నారు. ఎంపీ బండి సంజయ్ చేస్తున్నది పేరుకే సంగ్రామ యాత్ర అని, అబద్దాల పునాదులతో బీజేపీ నాయకులు గెలిచారని మండిపడ్డారు. పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి అధర్మపురి అరవింద్ అని, ఎర్రజొన్నకు మద్దతు ధర, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీలు ఏమయ్యాయని బీజేపీ నేతలను ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.