Chinna jeeyar Controversy : చినజీయర్ దిష్టిబొమ్మ‌లు త‌గ‌ల‌బెట్ట‌మ‌న్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..!

  • Written By:
  • Publish Date - March 17, 2022 / 02:19 PM IST

ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి వివాదంలో ఇరుక్కున్నారు. వ‌న‌ దేవ‌త‌లు స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ‌ల‌పై చినజీయ‌ర్ స్వామి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో, ఆయ‌న‌పై టీఆర్ఎస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంతారావు చిన‌జీయ‌ర్ స్వామిపై మండిప‌డ్డారు.

సమ్మక్క, సారలమ్మలను కోట్లాది మంది ప్ర‌జ‌లు కొలుస్తార‌ని, ఆదివాసీల‌ ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారలమ్మలను కించపరుస్తూ మాట్లాడిన చినజీయర్ స్వామి క్షమాపణలు చెప్పాల‌ని ఎమ్మెల్యే కాంతారావు డిమాండ్ చేశారు. చినజీయర్‌లా మోసాల‌కు పాల్ప‌డ‌డం తమ జాతికి తెలియ‌ద‌ని చెప్పిన ఎమ్మెల్యే కాంతారావు, ఆదివాసీల గూడెంల‌లో చినజీయర్ స్వామి దిష్టిబొమ్మలను తగులబెట్టాలని పిలుపు నిచ్చారు.

ఇక మ‌రోవైపు చినజీయర్ స్వామిపై ఎమ్మెల్యే సీత‌క్క ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద అహంకారపూరితమైన మాట్లాడారని సీత‌క్క మండిప‌డ్డారు. ఈ క్ర‌మంలో సీత‌క్క మాట్లాడుతూ.. మా తల్లులది వ్యాపారమా.. భ‌క్తులు మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదని చెప్పిన సీత‌క్క‌, మీరు పెట్టిన 120 కిలోల బంగారు సమతా మూర్తి విగ్రహం చూసేందుకు 150 రూపాయ‌ల ధర పెట్టార‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసిన సీత‌క్క రియల్ ఎస్టేట్ స్వామి అయిన చిన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై స్పందించి, తగిన బుద్ధి చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.

అయితే చినజీయర్ స్వామి మాట్లాడిన వీడియో ఇప్పటిది కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం, చాలా ఏళ్ల క్రితం ఓ ప్రముఖ చానల్‌లో ఆయన ఇచ్చిన ప్రసంగాల వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేయ‌డంతో చినజీయర్‌పై సమ్మక్క-సారలమ్మ భక్తులు భగ్గుమంటున్నారు. అస‌లు ఆ వీడియోలో ఆయ‌న ఏమ‌న్నారంటే. వాళ్లేం దేవతలా.. బ్రహ్మలోకం నుంచి దిగివచ్చారా, వాళ్ళ చ‌రిత్ర ఏమిటి, ఏదో ఒక అడవి దేవత అంట‌, గ్రామదేవత అంట‌, అక్క‌డుండేవాళ్లు చేసుకోనీ సరే, చదువుకున్నవాళ్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా వారి పేరుతో బ్యాంకులే పెట్టేశారు, ఇప్పుడ‌ది వ్యాపారమైపోయింది.. ఎంత అన్యాయం.. కావాల‌నే స‌మాజంలో ఒక చెడును వ్యాపింపజేస్తున్నారంటూ అప్ప‌ట్లో చినజీయర్ స్వామి వన దేవుతల్ని కించ పరిచేలా మాట్లాడారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో స‌మ్మ‌క్క‌- సార‌ల‌మ్మ‌ల భ‌క్తులే కాకుండా నెటిజ‌న్లు సైతం చిన‌జీయ‌ర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ, ఆయ‌న దిష్టి బొమ్మ‌ల‌ను త‌గ‌ల‌బెడుతున్నారు.