Telangana: నోటి మాట కాదు.. రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి – నిరంజన్ రెడ్డి

కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్​ను కలిసి ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం దిల్లీ వెళ్లారు.

  • Written By:
  • Publish Date - December 20, 2021 / 01:27 PM IST

కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్​ను కలిసి ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం దిల్లీ వెళ్లారు. అక్కడే మీడియాతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ… కేంద్రం ఇస్తున్న అనేక హామీలు అమలు కావడంలేదని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ‘ధాన్యం కొనుగోలు చేస్తామని నోటి మాట కాదు.. రాత పూర్వక హామీ ఇవ్వాలని’ స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే పూర్తి ధాన్యం తీసుకుంటామని.. కేంద్రం రాత పూర్వకంగా హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమే దిల్లీ వచ్చామనీ.. తక్షణమే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వీలైనంత త్వరగా సమయం ఇచ్చి మా గోడు వినాలని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. దిల్లీకి వచ్చే ముందే కేంద్రమంత్రి అపాయింట్‌మెంట్ కోరాం, సమస్య తీవ్రతను కేంద్రమంత్రి పరిగణనలోకి తీసుకోని వెంటనే మాకు సమయం ఇచ్చి రైతుల సమస్యను పరిష్కరించాలి. ధాన్యం కొనుగోళ్లపై రాతపూర్వక ప్రకటన కావాలి. ఇప్పటికే 6,952 కొనుగోలుకేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు చేశాం.ఇంకా కేంద్రాల్లో 12-15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది. ఐదు లక్షల ఎకరాల్లో పంట కోతకు రావాల్సి ఉండగా జనవరి 15 వరకు వానాకాలం వరి కోతలు జరుగుతాయి. ఏడాదిలో కేంద్రం ఎంత ధాన్యం తీసుకుంటుందో చెప్పాలని టీఆర్ఎస్ మంత్రులు డిమాండ్ చేశారు.