తమ సొమ్ము సోమవారం..ఒంటి పొద్దులుంటాము..మంది సొమ్ము మంగళవారం…ముప్పొద్దుల తింటాము అంటే ఇదేనెమో…కోట్లు ఖర్చు పెట్టి హరితహారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టింది. కానీ రోడ్డునపోయే వారికి తన కమర్షియల్ కాంప్లెక్స్ కనిపించకుండా అడ్డుగా ఉన్నాయన్న కారణంతో 70 చెట్లను నరికించారు మంత్రి మల్లారెడ్డి. కొన్ని చెట్లను వేళ్లతో సహా పెకిలించారు. కొన్నింటి కొమ్మలు నరికేయించారు. పచ్చదనాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం హరితాహారన్ని చేపడుతుంటే.. మంత్రి మల్లారెడ్డి మాత్రం చెట్లను నరికించడం అటవీశాఖ అధికారులను విస్మయానికి గురిచేసింది.
శామీర్ పేట్ మండలం..అలియాబాద్ వద్ద మల్లారెడ్డి ఓ కమర్షియల్ కాంప్లెక్స్ ను నిర్మించారు. దాని ముందు రోడ్డు పక్కన పెద్ద చెట్లు ఉన్నాయి. మంత్రి కూతురు చామకూర ప్రీతి పేరిట అప్లికేషన్ రావడంతో…మూడు చెట్లను నరికేందుకు గతంలో పర్మిషన్ ఇచ్చింది అటవీశాఖ. కానీ ఏకంగా 70 చెట్లను నరికేయించారు. ఇక మంత్రి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. స్పీచ్ ఇవ్వడంలో తనకెవరూ సాటిరారు అనే విధంగా దంచికొడతారు. చెట్లు పెంచితేనే రోగాలు రావు..వర్షాలు కురుస్తాయని చెప్పే పెద్దమనిషి…ఇప్పుడు చెట్లను నరికివేయించడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. సామాన్యులు చెట్లు నరికితే…వేలల్లో ఫైన్లు వేసే అధికారులు…ఈ ఘటనపై నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. సీఎం తరచుగా ప్రయాణించే రూట్ కావడంతో…తాము మొక్కలు నాటి ప్రత్యేక శ్రద్ధ పెట్టి పెంచామని…వాటిని నరికివేయడంతో తమకు బాధగా ఉందని ఓ ఆఫీసర్ ఆవేదన వ్యక్తం చేశారట. మల్లారెడ్డి మంత్రి కావడంతో ఏం చేయలేకపోతున్నామని చెప్పారట.