Dalit Bandhu Card:మునుగోడు బై పోల్ కోసం “దళిత బంధు” కార్డు.. టీఆర్ఎస్ ఆశల వల!!

హుజూరాబాద్ ఉప ఎన్నిక వ్యూహాన్నే టీఆర్ఎస్ మునుగోడులోనూ అమలు చేయనుందా? దళిత బంధు పథకం చూపించి అక్కడి దాదాపు 40,000 మంది దళితుల ఓట్లను పొందాలని భావిస్తోందా?

  • Written By:
  • Publish Date - August 11, 2022 / 06:30 PM IST

హుజూరాబాద్ ఉప ఎన్నిక వ్యూహాన్నే టీఆర్ఎస్ మునుగోడులోనూ అమలు చేయనుందా? దళిత బంధు పథకం చూపించి అక్కడి దాదాపు 40,000 మంది దళితుల ఓట్లను పొందాలని భావిస్తోందా? అంటే.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆ దిశగానే సంకేతాలు ఇస్తున్నాయి. ఇంతకుముందు మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 100 మందిని దళిత బంధు పథకం కోసం ఎంపిక చేశారు. అయితే వారిలో కేవలం 38 మందికే దళిత బంధు పథకాన్ని అందించారు. మరో మూడు నెలల్లో మునుగోడు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో .. త్వరలో మరింత మందికి దళిత బంధు ప్రయోజనాన్ని కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఇందుకోసం అవసరమైన బడ్జెట్ ను కేటాయించే దిశగా దృష్టి సారించాలని ఆర్ధిక శాఖకు మార్గదర్శకాలు అందినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న తెలంగాణ కేబినెట్ సమావేశంలోనూ మునుగోడులో దళిత బంధు అమలుకు నిధుల కేటాయింపుపై ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. మునుగోడు పరిధిలో పెండింగులో ఉన్న అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు బడ్జెట్ కేటాయింపులు కూడా చేసే సూచనలు ఉన్నాయి.

లెక్కల వెనుక లోగోట్టు..

మునుగోడు నియోజకవర్గంలోని జమస్తాన్ పల్లిలో తొలిసారి పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధు స్కీం ను అమలు చేశారు. అక్కడి 39 దళిత కుటుంబాల్లో 38 ఈ పథకానికి ఎంపిక అయ్యాయి. ఇప్పటికే లబ్ధిని కూడా పొందాయి. సంస్థాన్ నారాయణ్ పూర్ మండలంలోని చిమిర్యాలలో 35 కుటుంబాలు, గుడి మల్కాపూర్ లో 25 కుటుంబాలను సైతం దళిత బంధుకు ఎంపిక చేశారు. అయితే వాటికి నేటికీ పథకం ప్రయోజనం చేకూరలేదు. ప్రస్తుతానికైతే లబ్ధిదారుల ఎంపికకు నిర్దిష్ట నియమ నిబంధనలు లేనప్పటికీ.. 2 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న దళితులను అర్హులుగా పరిగణిస్తున్నారు. హుజూరాబాద్ బై పోల్ సమయంలో ఆ నియోజకవర్గంలోని దాదాపు 18000 దళిత కుటుంబాలకుగానూ 400 కుటుంబాలకు దళిత బంధు లబ్ది చేకూర్చారు. అయినా ఎన్నికల ఫలితం పెద్దగా మారలేదు.ఈసారి కూడా అదేవిధంగా దళిత బంధును కొందరికి మంజూరు చేసినా టీఆర్ఎస్ కు పెద్దగా ఓట్లు పెరగవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో దళిత బంధు పథకానికి ఎంపిక చేసేందుకు దళారులు.. ఒక్కో లబ్ధిదారుడి నుంచి దాదాపు 2 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈసారి కూడా మునుగోడు లో ఆ విధమైన బాగోతాలు వెలుగులోకి వస్తే టీఆరెస్ సర్కారుకు మచ్చలా మారే ముప్పు ఉంటుంది.

బహుముఖ వ్యూహం సైతం రెడీ..

హుజురాబాద్ ఉపఎన్నికకు ముందు దళిత బంధు లాంటి మెగా స్కీమ్స్ తీసుకొచ్చారు. హుజురాబాద్‌ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి వేలకోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇక నియోజకవర్గం అభివృద్ధి పేరుతోనూ భారీగానే ఖర్చు పెట్టారు. అయినా టీఆర్‌ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. మళ్ళీ దళిత బంధు లాంటి పథకాలనే నమ్ముకుంటే పెద్ద ప్రయోజనం ఉండదని పరిశీలకులు అంటున్నారు. ఈనేపథ్యంలో టీఆరెస్ సైతం బహుముఖ వ్యూహాన్ని అనుసరించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ఈక్రమంలోనే మునుగోడు నియోజకవర్గంలో అక్కడి గ్రామాల ప్రజల కోరిక మేరకు నూతనంగా గట్టుప్పల మండలం ఏర్పాటు చేసింది. మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాల వారీగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇక పంద్రాగస్టు రోజు సీఎం కేసీఆర్ కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ముందే చెప్పారు. దీంతో మునుగోడు మండలంలో కొత్త పింఛన్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీ వేగవంతం చేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. దీంతోపాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేసి లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ విడుదలై ఎన్నికల ప్రచారం మొదలయ్యే నాటికి పరిస్థితులు మారే ఛాన్స్ ఉందని అంటున్నారు.