Munugode By-Election : టికెట్ కోసం టీఆర్ఎస్ నేతల లాబీయింగ్

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

  • Written By:
  • Updated On - August 4, 2022 / 12:48 PM IST

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు టీఆర్‌ఎస్ లో టికెట్ కోసం ప‌లువురు ఆశావాహులు పోటీ ప‌డుతున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ వ‌ద్ద‌కు ఆశావాహులు క్యూ క‌డుతున్నారు. రాజగోపాల్ రెడ్డి మంగళవారం రాజీనామా ప్రకటించినప్పుడు న‌ల్గొండ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్ రెడ్డి సీఎం కేసీఆర్‌ని క‌లిశారు. తన సోదరుడు కంచర్ల కృష్ణా రెడ్డికి టిక్కెట్ ఇవ్వాల‌ని ఆయ‌న సీఎం కేసీఆర్ ని కోరిన‌ట్లు స‌మాచారం. ఇటు శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి సైతం మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆయ‌న కూడా అధిష్టానం వ‌ద్ద టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఒకవేళ తనను కౌన్సిల్ చైర్మన్‌గా కొనసాగించాలని పార్టీ భావిస్తే తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిని పరిగణనలోకి తీసుకోవాలని కూడా ఆయన అభ్యర్థించినట్లు సమాచారం.

ఇదిలావుండగా ఉమ్మ‌డి నల్గొండ జిల్లాకు చెందిన నేతలు తమకు లేదా తమ బంధువులకు లేదా మద్దతుదారులకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతూ బుధవారం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ ని కలిశారు. ఔత్సాహిక అభ్యర్థుల గెలుపును అంచనా వేసేందుకు సర్వేలు చేయిస్తామని టీఆర్‌ఎస్ నాయకత్వం వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్‌ బృందాల సర్వేలు ఎంపికలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిసింది.

నల్గొండ జిల్లాలోని 12 స్థానాలకు గాను 11 స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్‌ఎస్ మునుగోడును కైవసం చేసుకోవడం ద్వారా తన రాజకీయ ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మునుగోడుకు పెండింగ్‌లో ఉన్న నిధులు, ప్రాజెక్టులపై పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మునుగోడు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న నిధులు, పనులపై గ్రామాలు, మండలాల వారీగా ప్రతిపాదనలు సమర్పించాలని, ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందే వాటిని చేపట్టి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ పార్టీ జిల్లా నేతలకు సూచించినట్లు తెలిసింది.

2014లో మునుగోడు నుంచి గెలిచి 2018లో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వం కోసం నల్గొండ జిల్లా ఇంచార్జ్‌గా ఉన్న మంత్రి జి. జగదీశ్‌రెడ్డి లాబీయింగ్ చేస్తున్నారు. ఇటు భువ‌న‌గిరి లోక్‌సభ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, కర్నాటి విద్యాసాగర్‌లు బీసీ కోటా కింద టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.