నేడు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యసమావేశం జరగనుంది. తెలంగాణభవన్ లో మధ్యాహ్నం 2గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షత ఈ సమావేశం జరుగుతుంది. శాసనసభ, పార్లమెంట్ పక్షం, పార్టీ కార్యవర్గం సంయుక్తంగా భేటీ అవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్యవర్గ సభ్యులకు సమాచారం అందించారు. ఈ సమావేశానికి అందరూ హాజరుకావాలని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఎలా సిద్ధంచేయాలన్న ప్రధాన ఉద్దేశ్యంతోనే ఈ సంయూక్త సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మోదీ, బీజేపీ నాయకులు పూర్తిస్థాయిలో పట్టు సాధిస్తున్న నేపథ్యంలో వారిని ఎలా ఎదుర్కొవాలన్న విషయాలపై పార్టీ యంత్రాంగానికి సీఎం కేసీఆర్ సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యేల ప్రలోభాలకకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ కీలక అంశాలను ప్రస్తావిస్తారని తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశం ఇస్తామని గతంలోనే పలుమార్లు కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. మరోసారి ఈ అంశం ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం. వీటన్నింటితోపాటుగా సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.