Site icon HashtagU Telugu

Jr NTR : టీఆర్ఎస్ కు `జూనియ‌ర్` ద‌డ‌

Jr Ntr Kcr Amitshah

Jr Ntr Kcr Amitshah

ఆంధ్రా మూలాలు ఉన్న కేసీఆర్ తెలంగాణ‌కు సీఎం అయ్యారు. ఆయ‌న మూలాల‌ను ఉద్య‌మం స‌మ‌యం నుంచి ప‌లుమార్లు ప్ర‌త్య‌ర్థులు బ‌య‌ట‌పెట్టారు. ఉత్త‌రాంధ్ర మూలాలు ఉన్న కేసీఆర్ ప్ర‌త్యేక రాష్ట్రం వాదాన్ని అందుకుని రాజ్యాధికారాన్ని అందుకున్నారు. ఇప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ మూలాలు ఏమిటి? ఆయ‌న ఏ రాష్ట్రానికి చెందిన పౌరుడు అనే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జూనియ‌ర్ భేటీ త‌రువాత ఎన్టీఆర్ మూలాల్లోకి టీఆర్ఎస్ సానుభూతిప‌రులు వెళుతున్నారు.

సినిమా హీరోగా మాత్ర‌మే ఏపీతో జూనియ‌ర్ కు సంబంధాలు ఉన్నాయి. అంత‌కు మిన‌హా ఎలాంటి బంధాలు ఆ రాష్ట్రంతో లేవు. తెలంగాణ సీఎంకు ఎలాంటి బంధాలు ఏపీతో ఉన్నాయో అలాంటివే జూనియ‌ర్ కు ఉన్నాయి. కానీ, ఆయ‌న షాతో భేటీ అయిన త‌రువాత ఏపీ రాజ‌కీయాల్లో మాత్ర‌మే అల‌జ‌డి వ‌చ్చింది. తెలంగాణ రాజకీయాల్లో వ‌చ్చే మార్పు గురించి ప్ర‌స్తావ‌న పెద్ద‌గా లేదు. అయితే, బీజేపీ మాత్రం టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకుతో బ‌తుకుతోన్న టీఆర్ఎస్ ను రాజ‌కీయంగా స‌మాధి చేయ‌డానికి జూనియ‌ర్ ను వాడుకోవాల‌ని భావిస్తోంద‌ని తెలుస్తోంది. సీనియ‌ర్ ఎన్టీఆర్, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, టీడీపీకి అంగా ఉండే బీసీల‌ను అక్కున చేర్చుకోవ‌డానికి అమిత్ షా ఎత్తుగ‌డ వేశార‌ని తెలుస్తోంది. జూనియ‌ర్ ను ప్ర‌యోగించ‌డం ద్వారా టీఆర్ఎస్ ను ఖాళీ చేయొచ్చ‌ని షా వ్యూహ‌మ‌ని బీజేపీ తెలంగాణ వ‌ర్గాల్లోని టాక్‌.

ఎన్టీఆర్ ను ఎంతలా ప్రొజెక్టు చేసినా ఆయన్ను సీమాంధ్రకు చెందిన ప్రముఖుడిగానే పరిగణలోకి తీసుకుంటారని కొంద‌రు ఇప్ప‌టి నుంచే ప్ర‌చారం మొద‌లు పెట్టారు. కానీ, ఆయ‌న ఏపీతో ఎలాంటి సంబ‌ధాలు క‌లిగి లేడ‌నే విష‌యాన్ని విస్మ‌రిస్తున్నారు. నిజానికి అమిత్ షాను తారక్ కలుస్తారన్న వార్త బయటకు వచ్చినంతనే ఏపీ రాజకీయాలకు సంబంధించిన కూడికలు తీసివేతలు వేశారుగానీ తెలంగాణ రాజకీయాల్లో జూనియ‌ర్ ద్వారా పెనుమార్పులు సంభ‌విస్తాయ‌న్న విష‌యాన్ని గ‌మ‌నించ‌లేక‌పోతున్నారు.

మునుగోడు ఉప పోరు నేపథ్యంలో ఎన్టీఆర్ ను కలవటం ద్వారా బీజేపీకి కలిగే లాభం అపారం. తెలంగాణ , ఆంధ్రా సెంటిమెంట్ ను ర‌గిలిస్తే ఈసారి కేసీఆర్ కు భారీ న‌ష్టం వ‌స్తుంది. సీమాంధ్ర మూలాలతో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యవహారం హాట్ టాపిక్ గా మార్చాల‌ని టీఆర్ఎస్ భావిస్తోంది. అదే జ‌రిగితే, భారీ మూల్యాన్ని కేసీఆర్ చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌న్న విష‌యాన్ని గ్ర‌హించ‌డంలేదు. జూనియ‌ర్ తెలంగాణ రాష్ట్రంలో పుట్టారు. ఆయ‌న బాల్యం నుంచి తెలంగాణ‌తో ముడిప‌డి ఉంది. సినిమా హీరోగా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాంతాల‌కు, కులాని అతీతంగా పేరు సంపాదించుకున్నారు. అలాంటి హీరోకు ప్రాంతం, కులం కార్డ్ ను ఆపాదిస్తే టీఆర్ఎస్ పార్టీకి. వ‌చ్చే లాభం కంటే న‌ష్టం ఎక్కువ‌.
అన్ని కోణాల నుంచి ఆలోచించిన త‌రువాత అమిత్ షా వ్యూహాత్మ‌కంగా జూనియ‌ర్ తో భేటీ అయ్యారు. ఒక వేళ సెంటిమెంట్ ను రంగ‌రిస్తే ఈసారి కేసీఆర్ కు 2014 ఎన్నిక‌ల నాటి ఎమ్మెల్యే సంఖ్య కంటే త‌క్కువ‌గా వ‌చ్చే ఛాన్స్ ఉంది. ఆ విష‌యాన్ని టీఆర్ఎస్ అధిష్టానం గ‌మ‌నించిన‌ప్ప‌టికీ ఆ పార్టీ సానుభూతిప‌రులు ఇంకా గ్ర‌హించ‌లేన‌ట్టు ఉంది. అందుకే, జూనియ‌ర్ కు ప్రాంతాన్ని ఆపాదించే పాత‌కాల‌పు ప‌ద్థ‌తిని అనుస‌రిస్తున్నారు. ఈసారి సెంటిమెంట్ బూమ్ రాంగ్ అవుతుంద‌ని గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాలు చెప్పాయి. అందుకే, స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఘాట్ చుట్టూ టీఆర్ఎస్ ప్ర‌దక్షిణ‌లు చేస్తోందని స‌ర్వ‌త్రా తెలిసిన విష‌య‌మే.