TRS Party : టీఆర్ఎస్ `భూ` బ‌రితెగింపు

తెలంగాణ ప్ర‌భుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ల‌క్ష్మ‌ణ‌రేఖ‌ను సీఎం కేసీఆర్ చెరిపేశారు.

  • Written By:
  • Updated On - May 13, 2022 / 01:24 PM IST

తెలంగాణ ప్ర‌భుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ల‌క్ష్మ‌ణ‌రేఖ‌ను సీఎం కేసీఆర్ చెరిపేశారు. అధికారంలో ఉన్న కేసీఆర్ స‌ర్కార్ భూముల‌ను టీఆర్ఎస్ పార్టీకి దోచిపెడుతోంది. ఢిల్లీతో పాటు తెలంగాణ‌లోని 33 జిల్లాల్లో పార్టీ ఆఫీస్ ల‌ను ఏర్పాటు చేయ‌డాన్ని కూడా తెలంగాణ అభివృద్ధి కింద క‌ల్వ‌కుంట్ల కుటుంబం చెప్పుకుంటోంది. ఆ పార్టీ కార్యాల‌యాలు ఏర్పాటు చేయ‌డాన్ని కూడా తెలంగాణ‌కు గర్వ‌కార‌ణంగా ఆ కుటుంబం చెబుతుంటే ఉద్య‌మ‌కారులు నోరెళ్ల‌బెతున్నారు. ఔరా ఇందుకేనా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంద‌ని ప్ర‌శ్నించుకోవ‌డం మిన‌హా ఏమీ చేయ‌లేక మౌనంగా ఉండిపోతున్నారు.

నా ప్ర‌భుత్వం నా ఇష్టం అన్న‌ట్టు ఖ‌రీదైన బంజార‌హిల్స్ లోని 4,935 గ‌జాల స్థ‌లాన్ని కేవ‌లం గ‌జం రూ. 100 చొప్పున టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ స‌ర్కార్ ధార‌ద‌త్తం చేసింది. బంజారాహిల్స్‌లోని రోడ్‌నెంబర్‌ 12లోని ఎన్‌బీటీ నగర్‌లో 4,935 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండాలనే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ప్రణాళికలో భాగంగా ఈ కేటాయింపు జ‌రిగింది. ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సంతకంతో రెవెన్యూ శాఖ బుధవారం జారీ చేసిన జీఓ ఎంఎస్‌ నెం. 47 ప్రకారం, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ సిఫార్సు మేరకు భూమి కేటాయింపు జరిగింది. కేటాయించిన భూమిని హైదరాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ కార్యాలయ నిర్మాణానికి వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ భూమి హైదరాబాద్ జిల్లాలోని షేక్‌పేట్ గ్రామం మరియు మండలానికి చెందిన సర్వే నెం. 403/pలో ఉంది మరియు బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12, వార్డ్ 12, NBT నగర్, రోడ్ నంబర్ 12లోని బ్లాక్ K, 18/p, మరియు 21/pలో సర్వే నంబర్లలో ఈ ఖ‌రీదైన భూమి ఉంది. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ , పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం గతంలోనే కాంగ్రెస్ పార్టీ భూమి కేటాయించిన విష‌యాన్ని కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి దాసోజు శ్రావ‌ణ్ గుర్తు చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి స్థలాన్నిఇవ్వడమేంటని ప్రశ్నించారు. సీఎస్ సోమేశ్ కుమార్ ప్రభుత్వ సొమ్మును టీఆర్ఎస్ కు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. వంద కోట్ల విలువైన భూమిని గజానికి రూ.100 కే ఇవ్వడం విడ్డూరమన్నారు.

గ‌తంలో కేటాయించిన జ‌లసౌధం ప్లేస్ లో టీఆర్ఎస్ భవన్ నిర్మించారు. ప్ర‌స్తుతం అక్క‌డ‌ టీవీ చానెల్ నడుపుతున్నారు. అదే భ‌వ‌నంలో పార్టీ కార్యక‌లాపాల‌ను కూడా నిర్వ‌హిస్తున్నారు. అందుకే వేరే చోట పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం టీఆర్ఎస్ కు ప్రభుత్వ భూమిని కేటాయించామ‌ని అధికారులు చెబుతున్నారు. ప్రజల సొమ్మును నిలువునా టీఆర్ఎస్ దోచుకుంటోందన‌డానికి ఇదో నిద‌ర్శ‌నం. ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ ఆస్తులు వెయ్యి కోట్లకు చేరాయంటే ఆ పార్టీ అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాల‌ని విప‌క్ష నేత‌ల ఆరోప‌ణ‌. పేదోళ్ల త్యాగాల మీద రాష్ట్రం ఏర్పడితే టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి నాయకులు మాత్రం కోట్లు గడించార‌ని విమ‌ర్శిస్తున్నారు. బంగారు తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ల‌కు భూముల‌ను ధార‌ద‌త్తం చేయ‌డ‌మేనా? అంటూ నిల‌దీసే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.

రాజకీయ పార్టీలకు గజం స్థలాన్ని రూ.100కే ఇవ్వాలని నిర్ణయం తీసుకోగా యుద్ధప్రాతిపదికన 24 జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ ఆఫీసులకు 18.5 ఎకరాల భూమిని రూ.89 లక్షలకే కట్టబెట్టిన విషయం విదితమే. ఆయా భూముల విలువ అప్పటి మార్కె ట్‌ విలువ ప్రకారం రూ.69 కోట్లు కాగా, రూ.89 లక్షలకే టీఆర్‌ఎస్‌ తీసుకొని పార్టీ కార్యాలయాలు కూడా నిర్మించింది. టీఆర్‌ఎస్‌ కార్యాలయాలకు కేటాయించిన భూముల్లో అత్యధికం పురపాలక శాఖకు చెందినవే. వరంగల్‌, హనుమకొండ పార్టీ కార్యాలయం కోసం హనుమకొండలో రూ.14.52 కోట్ల విలువైన ‘కుడా’ స్థలాన్ని కేటాయించగా, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో పురపాలక శాఖ భూములు ఇచ్చారు. తెలంగాణ‌లోని 33 జిల్లాల్లోనూ పార్టీ ఆఫీస్ ను పెట్టుకోవ‌డానికి ప్ర‌భుత్వ స్థలాల‌ను కేటాయించుకోవ‌డం ఆ పార్టీ ద‌గాకు ఒక నిద‌ర్శ‌నంగా విప‌క్ష పార్టీల నేత‌లు చెబుతున్నారు. కానీ,టీఆర్ఎస్ పార్టీ మాత్రం సొంత పార్టీ ఆఫీస్ ల‌ను నిర్మించ‌డాన్ని కూడా బంగారు తెలంగాణ ఖాతాలో విజ‌య‌వంతంగా వేసేసింది.

తెలుగు రాష్ట్రాల నుంచి తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామ‌ని టీఆర్ఎస్ పార్టీ ఊద‌ర‌కొడుతోంది. 2020 అక్టోబర్‌ 9న 11 వందల చదరపు మీటర్ల భూమిని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి కేంద్రం కేటాయించింది. పార్టీ ఆఫీస్‌ భూమి కోసం టీఆర్‌ఎస్‌ 8 కోట్ల రూపాయలను కేంద్రానికి చెల్లించింది. ఆ స్థలంలో 40 కోట్ల‌తో పార్టీ ఆఫీస్ ను నిర్మించ‌డానికి ఒక ఉప ప్రాంతీయ పార్టీ సిద్ధం అయిందంటే ఏ స్థాయి దోపిడీ బంగారు తెలంగాణ పేరుతో జ‌రిగిందో ఎవ‌రైనా అర్థం చేసుకోవ‌చ్చు. పాపం తెలంగాణ ప్ర‌జ‌ల‌ను బంగారు తెలంగాణ మ‌త్తులోకి దించేసి సొంత ఆస్తుల‌ను క‌ల్వ‌కుంట్ల కుటుంబం దోచేసుకుంటుంద‌ని స‌ర్వ‌త్రా కోడైకూస్తోంది.