PK and TRS: గులాబీ సాబు.. బిహారీ బాబు.. పొలిటికల్ ఖాబు.. నేడే విడుదల!!

జాతీయ రాజకీయాల్లో దుమ్ము లేపుతానని చెబుతున్న కేసీఆర్ తో చెట్టపట్టాల్ కట్టేందుకు ప్రశాంత్ కిషోర్ రెడీ అవుతున్నాడు. ఇందుకోసం ఆయన బిహార్ గడ్డను అడ్డాగా మార్చుకొని కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు.

  • Written By:
  • Publish Date - May 5, 2022 / 05:00 AM IST

జాతీయ రాజకీయాల్లో దుమ్ము లేపుతానని చెబుతున్న కేసీఆర్ తో చెట్టపట్టాల్ కట్టేందుకు ప్రశాంత్ కిషోర్ రెడీ అవుతున్నాడు. ఇందుకోసం ఆయన బిహార్ గడ్డను అడ్డాగా మార్చుకొని కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. దాని పేరే ” జన్ సురాజ్ “. ఈనెల 5న ప్రెస్ కాన్ఫరెన్స్ వేదిక గా ఆ రాజకీయ పార్టీ లక్ష్యాలపై పీకే పూర్తి స్పష్టత ఇవ్వబోతున్నారు. ఢిల్లీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కేజ్రీవాల్ సక్సెస్ అయినట్టు.. బీహార్ నుంచి పోల్ కేక వేయాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్కెచ్ గీస్తున్నారు. ఈ విషయాన్ని పీకే తన ట్విట్టర్ ఖాతా వేదికగా మే నెల 2వ తేదీన వెల్లడించారు.

భవిష్యత్ పై స్పష్టత నేడే..

ప్రశాంత్ కిశోర్ కు చెందిన ” ఐ-ప్యాక్” సంస్థ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ సలహాలను ఇస్తోంది. మే 5 న “జన్ సురాజ్” ఏర్పాటుపై పీకే నోట ప్రకటన వెలువడిన తర్వాత.. టీఆర్ఎస్ కూడా నోరు విప్పే అవకాశం ఉంది. “జన్ సురాజ్ ” తో కలిసి, పీకే తో దోస్తీ చేస్తూ.. ముందుకు సాగాలా? వద్దా? అనే దానిపై టీఆర్ఎస్ వర్గాలు కూడా స్పష్టత ఇవ్వనున్నాయి. పీకే, కేసీఆర్ లు తమ ఉమ్మడి శత్రువు బీజేపీ పై పోరాట కార్యాచరణ ను కూడా వేర్వేరుగా ప్రకటించనున్నారు. మొత్తానికి 2024 సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా జన్ సురాజ్, టీఆర్ఎస్ లు సమాయత్తం అవుతాయి.

బిహార్ ను పీకే ఎందుకు ఎంచుకున్నాడు ?

ప్రశాంత్ కిషోర్ స్వరాష్ట్రం బీహార్. అక్కడి రాహ్ టాస్ జిల్లాలో పీకే జన్మించారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్న తొలి రాష్ట్రం కూడా బీహారే. 2018 సెప్టెంబర్ నుంచి 2020 జనవరి వరకు పీకే .. ప్రస్తుత బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు చెందిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) లో ఉపాధ్యక్ష హోదాలో పని చేశారు. ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేశారు. ఈక్రమంలో జేడీయూ సీనియర్ నాయకులు పీకే ను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆయన ఆ పార్టీ నుంచి క్రమంగా దూరం అయ్యారు. ఆ సమయంలో బీహార్ రాజకీయాలపై సాధించిన పట్టును పునాదిగా మల్చుకొని .. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా పీకే ముందడుగు వేశారు.