Site icon HashtagU Telugu

కేంద్రాన్ని టార్గెట్ చేసిన టీఆర్ఎస్‌.. బడ్జెట్‌లో కేంద్రం వైఖ‌రిని ఎండ‌గ‌ట్టిన స‌ర్కార్‌

551122

551122

తెలంగాణ‌లో బీజేపీ టీఆర్ఎస్ మ‌ధ్య ప్ర‌త్య‌క్ష యుద్ధం మొద‌లైంది. ఇప్ప‌టికే కేసీఆర్ దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీల‌ను బీజేపీకి వ్య‌తిరేకంగా కూడ‌గ‌డుతూ బీజేపీపై నేరుగా యుద్ధం ప్ర‌క‌టించారు. అయితే ఎన్న‌డూ లేని విధంగా ఈ సారి తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మైయ్యాయి. బ‌డ్జెట్ స‌మావేశాల్లో తెలంగాణ‌కు కేంద్ర చేస్తున్న అన్యాయాన్ని ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీష్ రావు త‌న ప్ర‌సంగంలో ఎండ‌గ‌ట్టారు.

తెలంగాణ‌లో ఆవిర్భావం త‌రువాత కూడా వివ‌క్ష ఎదురైతుంద‌ని.. ఉమ్మ‌డి రాష్ట్రంలో స‌మైఖ్య పాల‌కులు వివ‌క్ష చూపితే.. స్వ‌రాష్ట్రంలో కేంద్రం వివ‌క్ష చూపుతుంద‌ని హ‌రీష్ రావు ప్ర‌సంగించారు. కేంద్రం వైఖ‌రి తెలంగాణ ప్ర‌జ‌ల భాష‌లో చెప్పాలంటే కాళ్ల‌లో క‌ట్టెపెట్టిన‌ట్లు ఉంద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌గ‌తిశీల రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక ప్రోత్సాహ‌కాలు ఇవ్వ‌క‌పోగా నిరుత్సాహ‌ప‌రిచేలా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్నారు.తెలంగాణ పురిటి ద‌శ‌లో ఉన్న‌ప్ప‌టినుంచే కేంద్రం దాడిని ప్రారంభ‌మైంద‌ని.. ఆవిర్భావ వేడుక‌లు జ‌రుపుకోక‌ముందే ఖ‌మ్మం జిల్లాలోని ఏడు మండ‌లాల‌ను ఆంధ్రాలో క‌లిపార‌న్నారు.

ఏడు మండ‌లాల విలీనంతో తెలంగాణ లోయ‌ర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కోల్పోయింద‌న్నారు. ఐదేళ్ల పాటు హైకోర్టు విభ‌జ‌న చేయ‌కుండా కేంద్రం తాత్సారం చేసింద‌న్నారు. విభ‌జ‌న హ‌మీల‌ను ఇప్ప‌టికీ అమ‌లు చేయ‌డంలేద‌న్నారు. ఇది చాల‌ద‌న్న‌ట్లు పార్ల‌మెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి చ‌ర్చ జ‌రిగిన‌ప్ప‌డు ప్ర‌తిసారి త‌ల్లిని చంపి బిడ్డ‌ను బ్ర‌తికించార‌ని ప‌దే ప‌దే వ్యాఖ్యానిస్తూ కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తున్నార‌ని తెలిపారు. వెనుక‌బ‌డిన జిల్లాల‌కు నిధులు ఇవ్వ‌కుండా కేంద్రం మెండి వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని హ‌రీష్ రావు అన్నారు. బ‌డ్జెట్ స‌మావేశాలు మొత్తం కేంద్రం టార్గెట్ గానే సాగుతున్నాయి. అయితే మంత్రి హ‌రీష్ రావు ప్ర‌సంగాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకోవ‌డంతో ముగ్గురిని స‌స్పెండ్ చేశారు.