Site icon HashtagU Telugu

Prashant Kishor : ‘పీకే’ భుజంపై బీజేపీ తుపాకీ

Modi Prashant Kishor

Modi Prashant Kishor

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ వ్య‌వ‌హారం తెలంగాణ బీజేపీకి అందొచ్చిన అస్త్రంగా ప‌నిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీని మ‌రింత బ‌లహీన‌ప‌ర‌చ‌డానికి `పీకే` వాల‌కాన్ని క‌మ‌ల‌నాథులు సానుకూలంగా మ‌లుచుకుంటున్నారు. ఇంకో వైపు బీజేపీ కోవ‌ర్ట్ అంటూ `పీకే`పై కొంద‌రు ప్ర‌చారాన్ని మొద‌లు పెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యూత్ లీడ‌ర్ల‌కు ఏ మాత్రం `పీకే` జోక్యం న‌చ్చ‌డంలేదు. పార్టీలోని సీక్రెట్స్ బ‌య‌ట‌కు వెళతాయ‌ని కొంద‌రు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఏమీ తేల్చ‌కుండా నాన‌బెడుతోంది. కాంగ్రెస్ పార్టీలోకి `పీకే`ను తీసుకోవాలా? వ‌ద్దా? అనే అంశంపై సోనియా వేసిన క‌మిటీ నివేదిక‌ను ఇవ్వ‌నుంది. ఆ నివేదిక ప్ర‌కారం మాత్ర‌మే సోనియా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.

ఏఐసీపీ అధ్య‌క్షురాలు సోనియాతో వ‌రుస భేటీల‌ను నిర్వ‌హించిన పీకే హ‌ఠాత్తుగా రెండు రోజుల క్రితం ప్ర‌గ‌తిభ‌వ‌న్లో క‌నిపించారు. రెండు రోజుల పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ తో వ‌ర‌స‌గా భేటీల‌ను నిర్వ‌హించారు. రాబోవు ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ఉంటార‌ని ఆ పార్టీ చెబుతోంది. దేశ వ్యాప్తంగా మోడీకి ప్ర‌త్యామ్నాయం అనే విష‌యంలో మాత్ర‌మే కాంగ్రెస్‌, టీఆర్ఎస్ ఏకాభిప్రాయంతో ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో పొత్తుకు ఇరు పార్టీలు పైకి మాత్రం అయిష్టంగా ఉన్నాయి. ఆ విష‌యాన్ని ఇరు పార్టీల కీల‌క లీడ‌ర్లు చెబుతున్నారు. కానీ, దేశ స్థాయి ఈక్వేష‌న్ల ప్ర‌కారం టీఆర్ ఎస్, కాంగ్రెస్ పొత్తు అనే అంశాన్ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. స‌రిగ్గా ఈ పాయింట్ వ‌ద్దే తెలంగాణ బీజేపీ సానుకూల ప‌రిస్థితుల‌ను క్రియేట్ చేసుకుంటోంది.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం మేమంటే మేము అంటూ కాంగ్రెస్‌, బీజేపీ చాలా కాలంగా పోటీప‌డుతున్నాయి. ఇటీవ‌ల రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడు అయిన త‌రువాత కాంగ్రెస్ బ‌ల‌ప‌డింద‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. నాగార్జున సాగ‌ర్, హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే టీఆర్ ఎస్ కు ప్ర‌త్యామ్నాయం అనే రీతిలో కాంగ్రెస్ ఉండేది. ఆ త‌రువాత జ‌రిగిన గ్రేట‌ర్ ఎన్నిక‌లు, హుజూరాబాద్‌, దుబ్బాక ఉప ఫ‌లితాలు గులాబీ పార్టీకి క‌మ‌ల‌పార్టీ ప్ర‌త్యామ్నాయం అనే రీతిలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే టెంపోను కొన‌సాగిస్తూ వ‌రి ధాన్యం విష‌యంలో బీజేపీ దూకుడు పెంచింది. కానీ, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు గేమాడుతున్నాయ‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆ మేర‌కు ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేసే ప్ర‌య‌త్నం చేసింది.

తాజా ప‌రిణామాల‌ను చూపుతూ కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీ ఒకేతానులో ముక్కలంటూ బీజేపీ స్గోగ‌న్ అందుకుంది. రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కుమార్ మంగళవారం తన 13వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర 2ను ప్రారంభించి టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు వ్య‌వ‌హారంపై ఫైర్ అయ్యారు. ఇరు పార్టీలు ప్రశాంత్ కిషోర్ ను మ‌ధ్య‌న పెట్టి రహస్య ఒప్పందం చేసుకుంటున్నాయని ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ హైకమాండ్‌తో మధ్యాహ్న భోజనానికి వచ్చారని, ఆ తర్వాత కేసీఆర్‌తో కలిసి ప్రగతి భవన్‌లో డిన్నర్‌కు వచ్చారని గుర్తు చేశారు.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర, కేంద్ర స్థాయిలో రెండు పార్టీలకు పని చేస్తారన్న వార్తల నేపథ్యంలో బీజేపీ లీడ‌ర్ లక్ష్మణ్ కీల‌క వ్యాఖ్యలు చేశారు.టిఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటే కాబట్టి పికె రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్నారని ఆయ‌న అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు పీకేతో కలిసి మాట మార్చారని ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునేలా పీకే వ్యూహాలు రచిస్తున్నారని, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల పొత్తు కూడా పీకే ప్లాన్‌లో భాగమేనన్నారు. ఇలా,టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపై విస్తృతంగా ప్ర‌చారం చేయ‌డం ద్వారా ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా బీజేపీని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్లే మాస్ట‌ర్ ప్లాన్ క‌మ‌ల‌నాథులు వేశారు.

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా పాదయాత్ర కొనసాగిస్తానని బండి స్పష్టం చేశారు. తాత్కాలికంగా పాద‌యాత్ర‌కు బ్రేక్ అంటూ ప్ర‌చారం జ‌రుగుతున్న త‌రుణంలో దానికి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం సంజ‌య్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. టీఆర్ఎస్‌, కాంగ్రెస్ అంతుచూడ‌డానికి ఇదో చివ‌రి యుద్ధం అంటూ ఆయ‌న ముందుకు క‌దులుతున్నారు. మొత్తం మీద `పీకే` భుజంపై తుపాకీ పెట్టి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల‌ను కాల్చేయాల‌ని బీజేపీ వేసిన మాస్ట‌ర్ స్కెచ్ ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.