TRS Confident: కేసీఆర్ ‘హ్యాట్రిక్’ మ్యాజిక్!

ఉద్యమ పార్టీగా పేరు తెచ్చుకున్న టీఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్రం సాధించి రెండు సార్లు  అధికారాన్ని కైవసం చేసుకుంది. కేసీఆర్ మాయాజాలంతో పాటు కేటీఆర్, హరీశ్ రావు, కవితల దూకుడుతో ఎన్నో విజయాలను నమోదు చేసింది.

  • Written By:
  • Updated On - March 19, 2022 / 04:36 PM IST

ఉద్యమ పార్టీగా పేరు తెచ్చుకున్న టీఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్రం సాధించి రెండు సార్లు  అధికారాన్ని కైవసం చేసుకుంది. కేసీఆర్ మాయాజాలంతో పాటు కేటీఆర్, హరీశ్ రావు, కవితల దూకుడుతో ఎన్నో విజయాలను నమోదు చేసింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ చతురుతతో ముచ్చటగా మూడోసారి అధికారం దక్కించుకుంటామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేల్లో కొందరిని పక్కనబెట్టి కొత్త ముఖాలను రంగంలోకి దించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నప్పటికీ, ఆ పార్టీలోని అంతర్గత వర్గాలు మాత్రం ఆ అవకాశం లేదని కొట్టిపారేస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధించేందుకు కేసీఆర్ మంత్రం దోహదపడుతుందని పార్టీ నేత ఒకరు ధీమా వ్యక్తం చేశాడు.  ‘‘కేసీఆర్‌ మ్యాజిక్‌ పనిచేస్తే, ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా ఏ నాయకుడైనా భారీ మెజారిటీతో గెలుపొందవచ్చు. కేసీఆర్‌ మ్యాజిక్‌ లేకపోతే ఏ నాయకుడైనా, ఎంత బలంగా, ప్రజాదరణ ఉన్న నాయకుడైనా ఓడిపోతారు’’ అని పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. చంద్రశేఖర్ రావు అసెంబ్లీని రద్దు చేసి, 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు,  కొంతమంది పార్టీ నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో పట్టును కోల్పోవడంతో, 35 నుంచి 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించాలని పార్టీ వర్గాలు భావించాయి. కానీ, తన వ్యక్తిగత ఇమేజ్, పార్టీ ప్రజాదరణ గెలుపుకు దోహదపడుతుందని పేర్కొంటూ కేసీఆర్ మార్పును తిరస్కరించారు. అనుకున్నట్టే కేసీఆర్ అంచనా నిజమైంది. 2018 డిసెంబర్‌లో టీఆర్‌ఎస్ 88 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది.

అదే విధంగా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా భారీ సంఖ్య‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను వ‌దులుకోక‌పోవ‌చ్చు. “కొంతమంది అభ్యర్థులను మార్చాలని కేసీఆర్ నిర్ణయించుకుంటే, దాదాపు అరడజను మంది ఎమ్మెల్యేలను తొలగించే అవకాశాలున్నాయి. కానీ ఇకపై అలాంటివేమీ ఉండవు” అని పార్టీ నాయకుడు ఒకరు చెప్పారు. రాష్ట్రంలో జరిగిన అపారమైన అభివృద్ధిని చూసి ప్రజలు ఈసారి కూడా కేసీఆర్ మంత్రం జపిస్తారని టీఆర్‌ఎస్ నేతలు బలంగా నమ్ముతున్నారు. పైగా ప్రతిపక్షంలో బలమైన నాయకుడు లేడని ఎత్తిచూపారు. ‘‘కేసీఆర్ తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో మహోన్నతమైన వ్యక్తిత్వం. రావు రెండుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర మాజీ మంత్రిగా పనిచేశారు. అంతేకాదు ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌కు ఏ నాయకుడూ సాటి లేరు’’ అని టీఆర్‌ఎస్‌ అధినేత అన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ కేవలం కార్పొరేటర్‌ మాత్రమేనని, ఎమ్మెల్యేగా పోటీ చేసి విఫలమయ్యారని టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడ్డారు. “సంజయ్ అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు కాదు, కేసీఆర్ స్థాయి నాయకుడికి సరిపోలేడు” అని అభిప్రాయపడ్డారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పార్టీపై ఇప్పటి వరకు పట్టులేదని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్‌లోని కొందరు నేతలు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌కి నచ్చిన అభ్యర్థులను నిలబెట్టేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పూర్తి స్వేచ్ఛను, అధికారాన్ని ఇచ్చినా.. స్థానిక కాంగ్రెస్‌ నేతలు ఆయన అభ్యర్థుల ఎంపికను వ్యతిరేకించవచ్చు’’ అని టీఆర్‌ఎస్‌ నేత ఒకరు విశ్లేషించారు.  ‘‘ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విధేయుడిగా తెలంగాణలో రేవంత్ రెడ్డికి పేరుంది. అందుకే తెలంగాణవాదులు ఆయన నాయకత్వాన్ని అంగీకరించకపోవచ్చు’’ అని మరో టీఆర్‌ఎస్‌ నేత ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులు, తెలంగాణ అస్తిత్వం తదితర సానుకూల అంశాలు వచ్చే ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయిస్తాయి. నేటికీ జనాల్లో తెలంగాణకు పర్యాయపదం టీఆర్‌ఎస్‌’’ అని గులాబీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.