మునుగోడు ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం, సీపీఐ నేతలకు టీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు , సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరుకానున్నారు. నవంబర్ 3న ఉపఎన్నిక పోలింగ్ జరగనుండగా, నవంబర్ 6న ఫలితాలు రానున్నాయి.
అయితే మరోవైపు.. ఓటర్లను ఆకట్టుకునేదుకు ప్రధాన పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లకు ఎన్నికల సమయంలో మందు, డబ్బులు ఆశ చూపి తమ పార్టీకి ఓటు వేయమని చెప్పేవారు. కానీ మునుగోడు ఉపఎన్నిక అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఈ సారి డిజిటల్ లావాదేవీలవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి సారించారు. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారికి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈసారి డబ్బు పంపే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు యువతను ఆకర్షించేందుకు నయా ప్లాన్స్ వేస్తున్నాయి. ఓ 10 మంది యువకులు తమ పార్టీకి చెంది వుంటే వారికి పార్టీ నాయకులు రూ. 10వేలు ఇచ్చి, విమానంలో పయనించడానికి టికెట్లు ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటర్లకు ఓ పార్టీ నగదు రూపంలో అడ్వాన్స్‌లు కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రధాన పార్టీలు ఈ ఉపఎన్నికలో విజయం సాధించాలని చూస్తున్నాయి. ఏ పార్టీ విజయం సాధించిదో తెలియాలంటే నవంబర్ 6 వరకు వేచి చూడాల్సిందేనని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.