TRS Calls: కేంద్రంతో యుద్ధానికి కేసీఆర్ సిద్ధం!

వరిధాన్యం కొనుగోళ్ల విషయమై ఇటు రాష్ట ప్రభుత్వం, అటు కేంద్రం ప్రభుత్వం నువ్వానేనా అన్నట్టు మాటల యుద్ధానికి దిగుతున్నాయి.

  • Written By:
  • Updated On - April 8, 2022 / 05:11 PM IST

వరిధాన్యం కొనుగోళ్ల విషయమై ఇటు రాష్ట ప్రభుత్వం, అటు కేంద్రం ప్రభుత్వం నువ్వానేనా అన్నట్టు మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ప్రత్యక్ష ఆందోళనకు సైతం తెరలేపాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. రబీ సీజన్‌ వరిధాన్యాన్ని కేంద్రం సేకరించాలని డిమాండ్‌ చేసేందుకు టీఆర్‌ఎస్‌ నాయకత్వం దాదాపు 5,000 మంది పార్టీ నేతలను సమాయత్తం చేస్తోంది. మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఏప్రిల్ 10లోగా ఢిల్లీకి చేరుకుని ఏప్రిల్ 11న జరిగే ర్యాలీలో పాల్గొనాలని ఆదేశించింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో నిర్వహించనున్న తొలి ర్యాలీలో మంచి ప్రదర్శన ఇచ్చేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం నుంచి ఢిల్లీలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

కార్యక్రమం జరిగే వేదిక, సమయాన్ని పార్టీ ఇంకా ప్రకటించలేదు. మంగళవారం పంటి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న చంద్రశేఖర్‌రావు నిరసనలో పాల్గొనడంపై కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణ భవన్‌ నుంచి ర్యాలీ ప్రారంభించి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వరకు వెళ్లాలని సీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం జంతర్ మంతర్ వద్ద కొన్ని గంటల పాటు టీఆర్‌ఎస్ నేతలు ధర్నాకు దిగనున్నారు. ఈ ర్యాలీకి బీజేపీయేతర పార్టీల నేతలను ఆహ్వానిస్తారా లేదా అన్నదానిపై ఎలాంటి సమాచారం అందలేదు. భారతీయ కిసాన్ యూనియన్‌కు చెందిన రాకేష్ టికైత్, సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు, ఇతర రైతు సంఘాల నాయకులు పాల్గొంటారా అనేది స్పష్టత రావాల్సి వచ్చింది.