Sr.NTR : ఎన్టీఆర్ చ‌రిష్మా కోసం కేసీఆర్ త‌హ‌త‌హ‌!

తెలుగోడి ఆత్మ‌గౌర‌వాన్ని చాటిన మ‌హోన్న‌త వ్య‌క్తి స్వ‌ర్గీయ ఎన్టీఆర్. ఆయ‌న స్పూర్తిని కేసీఆర్ అందిపుచ్చుకున్నారు.

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 05:09 PM IST

తెలుగోడి ఆత్మ‌గౌర‌వాన్ని చాటిన మ‌హోన్న‌త వ్య‌క్తి స్వ‌ర్గీయ ఎన్టీఆర్. ఆయ‌న స్పూర్తిని కేసీఆర్ అందిపుచ్చుకున్నారు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వాన్ని వెలుగెత్తి చాటారు. ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఇక జాతీయ రాజ‌కీయాల వైపు కేసీఆర్ చూస్తున్నారు. అక్టోబర్ 5వ తేదీ ద‌స‌రా రోజు కొత్త పార్టీని ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది. సేమ్ టూ సేమ్ ఎన్టీఆర్ మాదిరిగా ఆయ‌న జాతీయ రాజ‌కీయాల్లోకి. అడుగు పెట్టే ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టారు.

తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆరు నెల‌ల్లోనే అధికారంలోకి వ‌చ్చిన ఎన్టీఆర్ జాతీయ రాజ‌కీయాల వైపు ఆనాడు చూశారు. తెలుగోడి ఆత్మ‌గౌర‌వం ఢిల్లీ వీధుల్లో వినిపించ‌డానికి నేష‌న‌ల్ ఫ్రంట్ పెట్టారు. వివిధ రాష్ట్రాల‌కు చెందిన నాయ‌కుల‌తో క‌లిశారు. కాంగ్రెస్ పార్టీ మూలాల‌ను ఛేదించేందుకు న‌డుంబిగించారు. ఆ స‌మ‌యంలో భార‌త‌దేశం అనే పార్టీని పెట్టాల‌ని అనుకున్నార‌ట‌. కానీ, అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య తెలుగుదేశం పార్టీకి ప‌రిమితం అయ్యారు. కానీ, కేసీఆర్ మాత్రం టీఆర్ఎస్ నుంచి ఒక‌డుగు ముందుకేసి న‌వ‌భార‌త్ పార్టీని పెట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

గ‌త కొన్ని నెల‌లుగా జాతీయ ఎజెండా, జెండాను రూపొందించ‌డానికి కేసీఆర్ మేధావులు, వివిధ రంగాల నిపుణుల‌తో భేటీ అయ్యారు. ద‌స‌రా నాటికి జెండా, అజెండాతో పాటు టీఆర్ఎస్ ను క్లోజ్ చేసిన న‌వ‌భార‌త్ పార్టీ దిశ‌గా వెళ్ల‌డానికి సిద్ధం అవుతున్నార‌ని తెలుస్తోంది. ఆ దిశ‌గా పార్టీలోని లీడ‌ర్ల‌కు సంకేతాలు ఇచ్చారు. అందుకే, మంత్రి మ‌ల్లారెడ్డి కూడా ద‌స‌రా రోజున సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న కేసీఆర్ నుంచి వింటామ‌ని వెల్ల‌డించారు.

ఎన్టీఆర్ స్పూర్తితో వెళుతోన్న కేసీఆర్ తెలుగోడి గౌర‌వం నినాదాన్ని అందింపుచ్చుకుంటారా? సౌత్ నినాదం తీసుకుంటారా? ప్ర‌త్యేక ఎజెండాను వినిపిస్తారా? అనేది ఆస‌క్తిక‌రం. ఆ లోపుగా `నాడు ఎన్టీఆర్-నేడు కేసీఆర్` అంటూ ఖ‌మ్మం కేంద్రంగా పోస్ట‌ర్ వెలిసింది. దీంతో ఖ‌మ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పార్టీకి పెద్ద‌గా ఓట‌ర్లు అక్క‌డ లేరని ప్ర‌త్య‌ర్థి పార్టీలు అంచ‌నా వేస్తుంటాయి. లీడ‌ర్ల‌ను ఇత‌ర పార్టీల నుంచి తీసుకున్న‌ప్ప‌టికీ ఓట‌ర్లు టీఆర్ఎస్ వైపు ఉండ‌ర‌ని టాక్‌. కానీ, ఒక్క‌సారిగా ఎన్టీఆర్ ఫోటోతో కేసీఆర్ క‌నిపించ‌డం అక్క‌డ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించింది.

ఎన్టీఆర్ చ‌రిష్మాను సొంత చేసుకునే దిశ‌గా కేసీఆర్ ముందుకు క‌దులుతున్నారు. రాబోవు రోజుల్లో కూడా ఎన్టీఆర్ జ‌పం చేయ‌డం ద్వారా ల‌బ్ది పొందాల‌ను ప్లాన్ చేస్తున్నార‌ని టాక్‌. ఇప్ప‌టికే సెటిల‌ర్ల ఓట్లు, టీడీపీ లీడ‌ర్ల నాయ‌క‌త్వంతో టీఆర్ఎస్ పార్టీ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీలోని ఉండే వాళ్ల‌లో 90శాతం పూర్వ‌పు టీడీపీ లీడ‌ర్లే. వాళ్ల తో పాటుగా ఓట‌ర్లు కూడా న‌డిచారు. దీంతో ఎన్టీఆర్ కు ఎన‌లేని ప్రాముఖ్య‌త‌ను ఇస్తూ దేశంలోనూ ఎద‌గాల‌ని కేసీఆర్ స్కెచ్ వేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.