Chandrababu : చంద్ర‌బాబును అలా వాడేస్తున్నారు.!

తెలంగాణ రాజ‌కీయాలు మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు చుట్టూ తిర‌గ‌డం లేటెస్ట్ ట్రెండ్‌గా క‌నిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - June 3, 2022 / 02:30 PM IST

తెలంగాణ రాజ‌కీయాలు మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు చుట్టూ తిర‌గ‌డం లేటెస్ట్ ట్రెండ్‌గా క‌నిపిస్తోంది. సామాజిక‌వ‌ర్గాల వారీగా 2023 ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని భావిస్తోన్న ప్ర‌ధాన పార్టీలు క‌మ్మ సామాజిక‌వ‌ర్గం మ‌ద్ద‌తు కోసం వ్యూహాలను ర‌చిస్తున్నాయి. ఆ క్ర‌మంలో చంద్ర‌బాబు ఆయ‌న సామాజిక‌వ‌ర్గాన్ని ఉటంకిస్తూ కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు వేస్తున్నాయి. అందులో భాగంగా 2001లో చంద్ర‌బాబునాయుడు ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డానికి కేసీఆర్ ప్ర‌య‌త్నం చేశాడ‌ని బీజేపీ నేత , మాజీ మంత్రి చంద్ర‌శేఖ‌ర్ వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సుమారు 60 మంది ఎమ్మెల్యేల‌ను బాబు కు వ్య‌తిరేకంగా కేసీఆర్ కూడగట్టాడ‌ని చెబుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అయింది.

మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని , డిప్యూటీ స్పీక‌ర్ గా ప‌రిమితం చేశాడ‌ని చంద్ర‌బాబు మీద కేసీఆర్ ఆనాడు కోపంగా ఉన్నారు. ఆ సంద‌ర్భంగా ప్ర‌భుత్వాన్నే ప‌డ‌గొట్టాల‌ని 60 మంది ఎమ్మెల్యేల‌ను ఒక‌చోట చేర్చాడ‌ని చంద్ర‌శేఖ‌ర్ చెబుతున్నారు. వాళ్ల‌లో ఇటీవ‌ల మ‌ర‌ణించిన బొజ్జ‌ల గోపాల‌క్రిష్ణారెడ్డి కూడా ఉన్నార‌ని వెల్ల‌డించారు. ఆయ‌న‌తో పాటు ప‌లువుర్ని కేసీఆర్ ఒక చోట‌కు చేర్చార‌ని ఆనాటి సీక్రెట్ ఆప‌రేష‌న్ ను చంద్ర‌శేఖ‌ర్ వెలుగులోకి తీసుకొచ్చారు. అప్ప‌ట్లో ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల నెహ్రూను కేసీఆర్ సంప్ర‌దించ‌డంతో ఆ విష‌యాన్ని నేరుగా చంద్ర‌బాబుకు చేర‌వేశార‌ట‌. దీంతో కేసీఆర్ ఆప‌రేష‌న్ ను చంద్ర‌బాబు చిత్తు చేశార‌ని మాజీ మంత్రి చంద్ర‌శేఖ‌ర్ చెబుతోన్న మాట‌. దీంతో క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఆనాటి కేసీఆర్ కుట్ర మీద ఆలోచ‌న‌లో ప‌డింది. ఇలాంటి ప‌రిణామాన్ని బీజేపీ కోరుకుంటోంది. అందుకే, చంద్ర‌శేఖ‌ర్ రూపంలో ఆ విష‌యాన్ని వ్యూహాత్మ‌కంగా బీజేపీ బ‌య‌ట‌పెట్టింద‌ని తెలుస్తోంది.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క‌ర్ణాట‌క కేంద్రంగా చేసిన రెడ్ల‌కు రాజ్యాధికారం అనే వ్యాఖ్య‌ల క్ర‌మంలో కమ్మ సామాజిక‌వ‌ర్గం వైపు టీఆర్ఎస్ ఆశ‌గా చూస్తోంది. అంత‌కు ముందే, హైటెక్స్ స‌మీపంలో విలువైన భూమిని క‌మ్మ సంఘానికి కేటాయిస్తూ కేసీఆర్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాదు, చంద్ర‌బాబు విజ‌న్ ను మంత్రి కేటీఆర్ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఇంకో వైపు సీఎం కేసీఆర్ బెంగుళూరు కేంద్రంగా చంద్ర‌బాబుతో స‌ఖ్య‌త ఉంద‌నే విష‌యాన్ని మీడియాకు చెప్పారు. ఏనాడూ చంద్ర‌బాబును శ‌త్రువుగా చూడ‌లేద‌ని, కేవ‌లం ప్ర‌త్య‌ర్థిగా మాత్ర‌మే చూశామ‌ని సుతిమెత్త‌గా మాట్లాడుతున్నారు. ఇటీవ‌ల వ‌ర‌కు చంద్ర‌బాబుపై నానా ర‌కాలుగా అనుచిత వ్యాఖ్య‌లు చేసిన క‌ల్వ‌కుంట్ల కుటుంబం ఇప్పుడు ఆయ‌న్ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. ఫ‌లితంగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గం టీఆర్ఎస్ కు మ‌ద్ధ‌తుగా ఉంటుంద‌ని ఆశిస్తోంది.

చంద్ర‌బాబు శిష్యునిగా ఫోకస్ అవుతోన్న రేవంత్ రెడ్డి ఇటీవ‌ల రెడ్డి సామాజిక‌వ‌ర్గ రాజ్యాధికారం గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక వైపు చంద్ర‌బాబు శిష్యునిగా క‌మ్మ. ఓటు బ్యాంకు ఇంకో వైపు సొంత రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఓటు బ్యాంకును ఒక చోట చేర్చేలా ఆయ‌న మాస్ట‌ర్ ప్లాన్ చేశారు. అందుకే, క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని ద‌గ్గ‌ర‌కు తీసుకునే పనిలో టీఆర్ఎస్ ఉంది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన బీజేపీ స‌రైన స‌మ‌యంలో చంద్ర‌బాబుపై 2001లో జ‌రిగిన కుట్ర‌ను బ‌య‌ట‌కు తీసింది. దీంతో క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని త‌మ వైపు తిప్పుకునే ఆలోచ‌న బీజేపీ చేస్తోంది. ప్ర‌స్తుతం బీజేపీ బీసీల నాయ‌క‌త్వంలో ఉంది. బీసీలు, క‌మ్మ సామాజిక‌వ‌ర్గం క‌లిసి ఒక‌ప్పుడు టీడీపీని నిల‌బెట్టారు. అదే ఈక్వేష‌న్ తో తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ జెండా ఎగుర‌వేయాల‌ని ప్లాన్ చేస్తోంది. ఆ క్ర‌మంలోనే చంద్ర‌బాబుపై 2001లో కేసీఆర్ కుట్ర‌ను ఇప్పుడు బ‌య‌ట‌కు తీసింద‌ని తెలుస్తోంది.

2014 ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ పొత్తుతో వెళ్లాయి. ఆ ఎన్నిక‌ల్లో 19 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకున్నారు. వాళ్ల‌లో న‌లుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాబోవు 2023 ఎన్నిక‌ల్లో ఆ రెండు పార్టీలు పొత్తుతో వెళితే, 2014 కంటే. ఎక్కువ‌గా గెలుచుకోవ‌చ్చ‌ని బీజేపీ భావిస్తోంద‌ట‌. అంతేకాదు, రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఈసారి రేవంత్ రెడ్డి వైపు మొగ్గుచూపితే ఆ పార్టీ బ‌లప‌డే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ లీడ‌ర్ల‌తో నిండిపోయిన టీఆర్ఎస్ నుంచి వాళ్ల‌ను దూరం చేస్తే దాదాపుగా కారు పార్టీ ఖాళీ అవుతోంది. అందుకే, ఇప్పుడు చంద్ర‌బాబు, ఆయ‌న సామాజిక‌వ‌ర్గం మ‌ద్ధ‌తు పై బీజేపీ వ్యూహం ర‌చిస్తోంది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఓట్లు మాత్రమే కాపాడాయ‌ని టీఆర్ఎస్ అంచ‌నా వేస్తోంది. ఆ ఓట్ల‌ను వ‌ద‌ల‌కుండా ఉండేలా టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంటే, ఆ సామాజిక‌వ‌ర్గానికి కేసీఆర్ చేసిన ద్రోహాన్ని బీజేపీ గుర్తు చేస్తోంది. బాబు శిష్యునిగా క‌మ్మ‌ సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌ను మ‌ల్కాజ్ గిరి లోక్ స‌భ‌లో పొందిన రేవంత్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ వైపు తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేప‌థ్యంలో తెలంగాణ పాలిటిక్స్ చంద్ర‌బాబు చుట్టూ తిర‌గ‌డం గ‌మ‌నార్హం.