TRS and Congress: ‘దిగ్విజ‌య్’ రూపంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు

తెలంగాణ సీఎం కేసీఆర్ `మాతో క‌లిసి రావొచ్చు కాదా` అంటూ రెండు రోజులు క్రితం ఒక ప్రైవేట్ ఛాన‌ల్ కు

  • Written By:
  • Updated On - September 8, 2022 / 04:24 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ `మాతో క‌లిసి రావొచ్చు కాదా` అంటూ రెండు రోజులు క్రితం ఒక ప్రైవేట్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ చేసిన కామెంట్ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు అంశం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. రెండు రోజులుగా దిగ్విజ‌య్ సింగ్ కామెంట్ల మీద తెలంగాణ కాంగ్రెస్ లీడ‌ర్లు మౌనంగా ఉన్నారు. ఆ అంశంపై `భార‌త్ జోడో యాత్ర‌`లో ఉన్న‌ రాహుల్ గాంధీ వ‌ద్ద పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తోంది. వ‌రంగ‌ల్ స‌భ వేదిక‌గా పొత్తు విష‌యాన్ని కొట్టిపారేసిన విష‌యాన్ని రాహుల్ గుర్తు చేశార‌ట‌.

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ పొత్తు అంశం చాలా కాలంగా పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో న‌డుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కావ‌డానికి ముందే ఆ రెండు పార్టీ మ‌ధ్య పొత్తు చ‌ర్చ‌లు న‌డిచాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. కాంగ్రెస్ పార్టీలోని సీనియ‌ర్లు కొంద‌రు అధిష్టానం వ‌ద్ద కూడా ఆ విష‌యాన్ని ప్ర‌స్తావించార‌ని అప్ప‌ట్లో వినికిడి. దానికి బ‌లంచేకూరేలా ఇప్పుడు దిగ్విజ‌య్ సింగ్ కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌త్యేక తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాన‌ని అప్ప‌ట్లో కేసీఆర్ చెప్పార‌ని గుర్తు చేశారు. ఆ త‌రువాత కాంగ్రెస్ పార్టీని కాద‌ని వెళ్లాడ‌ని చెబుతూ, `మాతో క‌లిసి రావొచ్చు` అంటూ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయిన‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీతో వ‌స్తే బాగుంటుంద‌ని అన్నారు.

Also Read:   Telangana CPI: తెలంగాణ సీపీఐ పార్టీ ప్రక్షాళన!

జాతీయ రాజ‌కీయాల‌ను దృష్టి ఉంచుకుని దిగ్విజ‌య్ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ తో కూడిన విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు ఇటీవ‌ల భేష‌ర‌తుగా కేసీఆర్ మ‌ద్ధ‌తు ప‌లికారు. అంతేకాదు, రాహుల్ పుట్టుక మీద బీజేపీ కి చెందిన లీడ‌ర్లు చేసిన కామెంట్ల‌పై కేటీఆర్, కేటీఆర్ మండిప‌డ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు అంశాన్ని సోనియా వ‌ద్ద రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌స్తావించారు. ఆ రోజు నుంచి రెండు పార్టీలు ప‌రోక్షంగా ప‌లు సంద‌ర్భాల్లో క‌లిసి వెళ్ల‌డాన్ని చూస్తున్నాం.

తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా కాంగ్రెస్ పార్టీని ప‌లుచ‌న చేయ‌గ‌లిగారు. ప్ర‌త్యామ్నాయంగా బీజేపీని తెర‌పైకి తీసుకురావ‌డం ద్వారా కాంగ్రెస్ పార్టీని చాలా వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రంలో నీరుగార్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య పోటీ అనేలా ఫోక‌స్ ఇస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పొత్తు కోసం చూస్తుందని తెలుస్తోంది. అందుకే, ఏఐసీసీలోని సీనియ‌ర్ లీడ‌ర్ గా ఉన్న దిగ్విజ‌య్ సింగ్ `క‌లిసిపోదాం` అంటూ స‌రికొత్త స్లోగ‌న్ అందుకున్నారు. దీంతో సీఎం అభ్య‌ర్థిగా ఆశ‌గా చూస్తోన్న రేవంత్ రెడ్డి కి గొంతులో వెల‌క్కాయ‌ప‌డిన‌ట్టు అయింది. మొత్తం మీద కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు దిగ్విజ‌య్ రూపంలో బ‌య‌ట‌కు వచ్చిందంటే సీరియ‌స్ గా తీసుకోవాల్సిందే.

Also Read:   Sunil Kanugolu Survey: మునుగోడు రేసులో కాంగ్రెస్ ఔట్!

సాధార‌ణంగా జాతీయ పార్టీలు ప్ర‌ధాని పీఠం గురించి ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తాయి. ఆ కోణంలో కొన్ని రాష్ట్రాల్లో పార్టీని సైతం ప‌ణంగా పెట్టిన సంద‌ర్భాలు బోలోడు. ఆ కోణం నుంచి ఒక వేళ కేసీఆర్ యూపీఏకు అండ‌గా ఉంటానంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ పొత్తు ఖాయంగా ఉంటుంద‌ని భావించొచ్చు.