Tribal Woman: కేసీఆర్ వైద్యానికి ‘పురిటి నొప్పులు’

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు పూర్తికావోస్తున్నా.. కనీస సదుపాయాల్లేక గిరిజన గ్రామాల్లో అల్లాడుతున్నాయి.

  • Written By:
  • Updated On - May 2, 2022 / 01:37 PM IST

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు పూర్తికావోస్తున్నా.. కనీస సదుపాయాల్లేక గిరిజన గ్రామాలు అల్లాడుతున్నాయి. టెక్నాలజీ పరుగులు పెడుతున్నా.. సరైన రోడ్డు మార్గాలు లేకపోవడంతో బస్సు సౌకర్యానికి నోచుకోలేకపోతున్నారు. కనీసం టూ వీలర్స్ సైతం వెళ్లలేని దుస్థితి ఉండటంతో గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో నిశ్చితంగా ప్రసవించాల్సిన మహిళలు ప్రసవ వేదనతో కన్నుమూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నిర్మల్ ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం కోసం గిరిజన మహిళ (నిండు గర్భిణీ) దాదాపు 10 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాలకు కనీసం రోడ్లు మార్గం లేకపోవడంతో ఈ విషయం  ఆలస్యంగా వెలుగు చూసింది.

గత ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడే గిరిజనులు, వృద్ధులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి గంటల తరబడి మూళ్లబాటలో నడువాల్సిన దుస్థితి నెలకొంది.  నాగమ్మ అనే మహిళ అప్పుడే పుట్టిన బిడ్డను ఎత్తుకొని కాలినడకన గ్రామానికి చేరుకోవడం గిరిజనుల సమస్యలకు అద్దం పడుతోంది. జిల్లాలోని గోవెన నాయపుగూడ గ్రామానికి చెందిన నాగమ్మ అనే గిరిజన మహిళ ప్రసవ వేదనతో నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. తన ఇంటి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని బలన్‌పూర్‌కు వెళ్లేందుకు రెండు చిన్న కొండలు, వాగులు దాటాల్సి వచ్చింది. అక్కడి నుంచి అంబులెన్స్‌లో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. దీంతో ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక సొంతూరికి తిరుగు ప్రయాణం కోసం అప్పుడే పుట్టిన బిడ్డతో సహా అదే మార్గంలో బంధువు సాయంతో కలిసి కాలినడకన వెళ్లింది. ఆ మహిళ సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో కుటంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని చాలా గిరిజన గ్రామాలు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ద్విచక్ర వాహానాలు సైతం వెళ్లలేని దుస్థితి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు బాగా దెబ్బ తిని రాకపోకలకు మరిన్ని ఇబ్బందులను కలుగుతున్నాయి. గతేడాది ఆగస్టులో ఆదిలాబాద్ జిల్లా గాదిగూడలోని ఓ మహిళ ప్రసవ వేదనతో బాధపడుతుండగా, స్థానికులు భుజాలపై మోసుకొని, ఆ తర్వాత తాత్కాలిక స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రాజుబాయి అనే మరో గిరిజన మహిళ ప్రసవ సమయంలో ప్రాణాలు విడిచింది. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని మంగ్లి గ్రామంలోని ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవాలంటే దాదాపు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోంది. గత సంవత్సరం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దత్తత తీసుకున్న గ్రామాలలో మంగ్లీ ఒకటి. మండల కేంద్రానికి మంచి కనెక్టివిటీ ఉండేలా తాండాలు, గూడెంలను గ్రామపంచాయతీలుగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారని.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.