Site icon HashtagU Telugu

Telugu Students : విషాదం.. అమెరికాలో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

Telugu Students

Telugu Students

Telugu Students : అమెరికాలో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందారు. ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నివేశ్ (20), గౌతమ్ కుమార్ (19) ప్రాణాలు కోల్పోయారు.  శనివారం రాత్రి వీరిద్దరు తమ స్నేహితులతో కలిసి యూనివర్సిటీ నుంచి కారులో ఇంటికి తిరిగొస్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ వాహనం వీరి వెహికల్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలోని వెనుక సీటులో కూర్చున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు నివేశ్, గౌతమ్ అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై ఆదివారం మధ్యాహ్నమే  మృతుల తల్లిదండ్రులకు సమాచారం  అందించారు. నివేశ్, గౌతమ్ మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన 20 ఏళ్ల నివేశ్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ వాస్తవ్యుడు. నివేశ్ తల్లిదండ్రులు డాక్టర్ స్వాతి, డాక్టర్ నవీన్. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన 19 ఏళ్ల గౌతమ్ కుమార్ జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని శివునిపల్లి వాస్తవ్యుడు.  స్వర్ణకారుడు పార్శి కమల్ కుమార్, పద్మ దంపతుల పెద్ద కుమారుడే గౌతమ్ కుమార్. గౌతమ్ కుమార్ అమెరికాలోని అరిజోనా స్టేట్ విశ్వ విద్యాలయంలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గౌతమ్ కుమార్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడానికి రెండు మూడు రోజుల టైం పడుతుందని అంటున్నారు.

Also Read :Pawan Kalyan : పవన్‌ కల్యాణ్ సభలో.. కత్తులతో ఇద్దరు యువకుల హల్‌చల్ !

స్కాట్లాండ్ లో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు

స్కాట్లాండ్ లోని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు(Telugu Students) జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) కూడా ఓ ప్రమాదంలో చనిపోయారు. ఈ నెల 17న జితేంద్రనాథ్ కరుటూరి, చాణక్య బొలిశెట్టి తమ ఇద్దరు స్నేహితులతో కలిసి పెర్త్ షైర్ లోని ‘లిన్ ఆఫ్ టమ్మెల్’కు వెళ్లారు.రెండు నదులు కలిసే ఈ ప్రాంతంలో వీరు ట్రెక్కింగ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీటిలో జారి పడి కొట్టుకుపోయారు. అనంతరం కొద్ది దూరంలో వీరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒకరు హైదరాబాద్ కు చెందిన వారు కాగా, మరో విద్యార్థి ఏపీ వాస్తవ్యుడు. ఈ ప్రమాదంపై లండన్ లోని భారత హైకమిషన్ అధికారి బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

Also Read :Chinta Chiguru Vs Mutton : రేటులో రేసు.. మటన్‌తో చింతచిగురు పోటీ