Student Suicide: వరంగల్‌లోని జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పండగ పూట విషాదం నెలకొంది. పైడిపల్లి శివారులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని రేష్మిత హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య (Student Suicide) చేసుకుంది. హాస్టల్ గది రూమ్ లోపల నుండి గడియ పెట్టి ఉండడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు కిటికీ తలుపులు తీసి చూడగా ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించింది.
వరంగల్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో నల్గొండకు చెందిన రేష్మిత బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. కౌన్సెలింగ్ లో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఫ్రీ సీట్ రావడంతో రెండు నెలల క్రితమే అడ్మిషన్ తీసుకుంది. యూనివర్సిటీ హాస్టల్ లో మరో ముగ్గురు విద్యార్థులతో కలిసి రేష్మిత ఒకే రూమ్ లో ఉంటున్నారు. మహాశివరాత్రి పండగ సందర్భంగా నిన్న సాయంత్రం ఇద్దరి విద్యార్థులు తమ ఇండ్లకు వెళ్లగా, ఫ్రెషర్స్ పార్టీ కోసం డ్యాన్స్ ప్రాక్టీసు చేయడానికి మరో విద్యార్థిని రాత్రి 12 గంటల వరకు హాల్ లో ఉండిపోయింది. డాన్స్ ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత తన గదికి వచ్చి చూసేసరికి లోపల నుండి గడియ పెట్టి ఉంది. రేష్మితను ఎంత పిలిచినా స్పందన రాకపోవడంతో రూమ్ కిటికీలు తీసి చూడగా ఒక్కసారిగా విద్యార్థులు షాక్ కు గురయ్యారు. తన బెడ్ పై కుర్చీ వేసుకుని ఫ్యాన్ కు చున్నితే ఉరేసుకొని విగత జీవిగా కనిపించింది రేష్మిత.
రేష్మిత సూసైడ్ చేసుకున్న విషయాన్ని తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్ కు చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేష్మిత తల్లిదండ్రులు వచ్చేవరకు ఎదురుచూసి, ఆమె పేరెంట్స్ సమక్షంలో రేష్మిత డెడ్ బాడీని కిందకు దించి శవపరీక్షల కోసం ఎంజీఎం మార్చురీకి తరలించారు.
Also Read: MS Dhoni: నయా లుక్‌లో ఎంఎస్ ధోనీ.. హీరో లెవెల్ ఎంట్రీ, వీడియో వైరల్
తన రూమ్ లో ఎవరూ లేని సమయంలో రేష్మీత సూసైడ్ చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కావడంతో సీనియర్ల ర్యాగింగ్ ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని మొదట పోలీసులు భావించారు. ఆ కోణంలో రేష్మిత తోటి విద్యార్థులతో విచారించారు. యూనివర్సిటీ కాలేజీలో ర్యాగింగ్ జరగలేదని నిర్ధారించుకున్న తర్వాత రేష్మిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వ్యక్తిగత వివరాలను ఆరా తీశారు.
అడ్మిషన్ తీసుకున్నప్పటినుండి.. హాస్టల్లో ఉంటూ చదవలేనని మారాం చేసిందని రేష్మిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చదువు ఇష్టం లేదని చెప్పడంతో గత నెలలో రేష్మిత తల్లి కూడా తనతో పాటే వారం రోజులు హాస్టల్లో ఉండి బుజ్జగించి వెళ్లినట్లు చెప్తున్నారు హాస్టల్ వార్డెన్. గత కొద్ది రోజుల నుండి తన స్నేహితులతో సైతం సరిగా మాట్లాడట్లేదని, నిన్నటి నుండి పూర్తిగా ఆహారం తీసుకోకుండా మానసిక ఒత్తిడిలో ఉందని రేష్మిత సోదరికి హాస్టల్ వార్డెన్ సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇద్దామనుకునే లోపే రేష్మిత అనూహ్య నిర్ణయం తీసుకుంది. తన తోటి మిత్రుడు సైతం హాస్టల్ రూమ్ లో లేకపోవడంతో ఇదే అదనుగా భావించి రూమ్ లోని ఫ్యాన్ కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి తమ కుటుంబం పేరు నిలబెడుతుందనుకున్న రేష్మిత సూసైడ్ చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమతోపాటే కలిసి చదువుకున్న రేష్మిత మృతితో తోట విద్యార్థులు సైతం షాక్ కు గురయ్యారు. మరోవైపు రేష్మిత పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.