New Year : కొత్త ఏడాది వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు నడుస్తాయి.
- HYD వాహనదారులకు అలర్ట్
- నేడు నగరంలో ఫ్లైఓవర్లు మూసివేత
- ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లోకి నో ఎంట్రీ
కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు హైదరాబాద్ నగరం రెడీ అవుతోంది. అయితే.. వేడుకల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు నగరంలోని ప్రధాన కూడళ్లు, కీలక రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తరలివచ్చే ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్ పరిసర ప్రాంతాలను ‘నో ఎంట్రీ’ జోన్లుగా ప్రకటించారు.
భద్రతా కారణాల దృష్ట్యా.. అతివేగాన్ని అరికట్టేందుకు నగరంలోని దాదాపు అన్ని ఫ్లైఓవర్లను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే అత్యవసర సేవల దృష్ట్యా బేగంపేట, టోలీచౌకి ఫ్లైఓవర్లను మాత్రమే మినహాయించారు. ఇక విమాన ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రయాణానికి అనుమతి ఉంటుంది. కానీ, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా తమ వద్ద ఉన్న ఫ్లైట్ టికెట్‌ను పోలీసులకు చూపించాల్సి ఉంటుంది. అలాగే రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రైవేట్ బస్సులకు నగరంలోకి ప్రవేశం నిలిపివేయనున్నారు.
న్యూ ఇయర్ వేడుకల పేరుతో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. నగరవ్యాప్తంగా వందలాది చోట్ల స్పెషల్ టీమ్స్ తనిఖీలు నిర్వహించనున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనాల జప్తు, లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేడుకలు జరుపుకోండి.. కానీ ఇతరుల ప్రాణాలకు ఇబ్బంది కలిగించకండని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్లపై బైక్ రేసింగ్‌లు, అతివేగం, న్యూసెన్స్ సృష్టించే వారిపై సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచారు.
మెట్రో రైలు ప్రత్యేక సర్వీసులు
నగరవాసుల రవాణా కష్టాలను తీర్చేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు సంబరాలు చేసుకునే వారి కోసం ప్రత్యేకంగా నేడు ఒంటి గంట వరకు రైళ్లను నడపనున్నారు. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి ఈ అదనపు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అయితే.. రాత్రి ఒంటి గంట తర్వాత మెట్రో స్టేషన్ల లోపలికి ప్రవేశం ఉండదని, ఆ లోపే స్టేషన్ కు చేరుకోవాలని నిర్వాహకులు స్పష్టం చేశారు. సొంత వాహనాల కంటే ప్రజా రవాణాను వినియోగించుకోవడం ద్వారా సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని మెట్రో అధికారులు సూచించారు.
