Site icon HashtagU Telugu

TPCC Silence: మునుగోడు ఓటమిపై ‘టీకాంగ్రెస్’ మౌనం!

Tcongress

Tcongress

తెలంగాణలో టీకాంగ్రెస్ కు ఎదురుగాలి వీస్తోంది. ఉప ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలవుతోంది. తాజాగా మునుగోడు ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయిన అవమానాన్ని ఎదుర్కొన్నప్పటికీ, గ్రాండ్ ఓల్డ్ పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించకపోవడం గమనార్హం. బలమైన స్థానాల్లో ఒకటి అయిన మునుగోడును కోల్పోవడం టీకాంగ్రెస్ కు గట్టిదెబ్బ తగిలినట్టయింది. 2018 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఉప ఎన్నికల ఫలితాలను సమీక్షించడంలో టీపీసీసీ విఫలమైందని పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి మాత్రం కోమటిరెడ్డి కోవర్ట్ ఆపరేషన్ వల్ల మునిగిపోయానని స్పష్టం చేసింది.  “కొంతమంది పార్టీ కార్యకర్తలు మౌనంగా ఉండి, తమకు భారీ మొత్తంలో డబ్బు అందడంతో కష్టపడి పనిచేస్తున్నట్లు నటించారు’’ అని స్రవంతి ఆరోపించారు. “మనం ఎక్కడ తప్పు చేశామో అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తు లో దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి రివ్యూ అవసరం” అని స్రవంతి వివరించారు. ఇదే విషయమై సీనియర్ నాయకుడు మాట్లాడుతూ.. ఒక పార్టీ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నప్పుడు, అది ఎందుకు గెలవలేకపోయిందో అర్థం చేసుకోవడానికి సమీక్ష సమావేశం నిర్వహించడం చాలా ముఖ్యం అని అన్నారు.

Also Read:  MLC Kavitha: చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కవిత భరోసా!

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో ఓటమి పాలైనప్పటి నుంచి పార్టీపై సమీక్షా సమావేశం నిర్వహించాలని పట్టుబడుతున్నట్లు తెలిపారు.‘‘కాంగ్రెస్‌ హుజూర్‌నగర్‌, దుబ్బాక, నాగార్జునసాగర్‌, హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో ఓడిపోయిందని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 స్థానాలకు గానూ కేవలం రెండు సెగ్మెంట్లలో మాత్రమే విజయం సాధించగలిగిందని అన్నారు. అయితే, సమీక్షా సమావేశం జరగలేదు” అని మాజీ ఎంపీ ఒకరు అభిప్రాయపడ్డారు.