Site icon HashtagU Telugu

ED – Kavitha : కవితకు ఈడీ సమన్లు.. బీఆర్ఎస్‌కు బీజేపీ ‘బీ టీమ్’ కాదని నమ్మించేందుకే : కాంగ్రెస్

Ed Kavitha

Ed Kavitha

ED – Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు ​​జారీ చేసిన అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. లోక్‌సభ ఎన్నికల టైం సమీపిస్తున్నందునే కేంద్రంలోని  బీజేపీ సర్కారు మరోసారి డ్రామాకు తెరలేపిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ చమల వ్యాఖ్యానించారు.  ‘‘బీఆర్‌ఎస్‌కు తాము ఏ టీమ్ కానీ.. బీ టీమ్ కానీ కాదని తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నాలలో బీజేపీ ఉంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకురాలు కవితకు ఈడీ నుంచి నోటీసులను పంపుతోంది’’ అని విమర్శించారు. ‘‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ ఓడిపోబోతున్నందున.. ఈ పరిస్థితిని అదునుగా  తీసుకొని తెలంగాణలో ఓటు శాతాన్ని మరింత పెంచుకునే ప్లాన్‌లో బీజేపీ ఉంది’’ అని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనవారని, బీజేపీ, బీఆర్ఎస్‌ల ఇలాంటి వ్యూహాలు ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని  చూపించవని ఆయన(ED – Kavitha) స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఇవాళ(మంగళవారం) విచారణకు  హాజరుకావాలని కోరింది.  అయితే దీనిపై కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ విచారణకు హాజరుకాలేనని ఈడీకి కవిత తెలియజేశారు. ఈడీ నోటీసులపై తాను  ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించానని.. దానిపై పిటిషన్ పెండింగ్‌లో ఉండగా విచారణకు రాలేనని స్పష్టం చేశారు. ఈమేరకు ఈడీ అధికారులకు కవిత లేఖ రాశారు. దీనిపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చేవరకు.. విచారణకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. దేశంలో సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి గతంలోనూ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది.  గతేడాది మార్చిలో మూడు రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. అయితే ఈడీ నోటీసులు, విచారణ పద్ధతిపై కవిత గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళనైన తనను విచారణ కోసం.. ఈడీ ఆఫీసుకు పిలిచి రాత్రి వరకు విచారణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ.. సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ వేశారు.

Also Read: Free Download : ‘శ్రీరామ్‌ చరిత్‌ మానస్’‌కు ఆర్డర్ల వెల్లువ.. నేటి నుంచి ఫ్రీ డౌన్‌లోడ్

ఈడీ కార్యాలయంలో మహిళల విచారణ సీఆర్సీసీకి విరుద్ధం అంటూ కవిత మొదటి నుంచి వాదిస్తున్నారు. నళిని చిదంబరం తరహాలో ఇంటివద్దే తనను కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పిటిషన్‌ సుప్రీం కోర్టు విచారణలో ఉన్న సమయంలోనే.. గతేడాది సెప్టెంబర్‌లో ఈడీ మళ్లీ నోటీసులు పంపటంతో.. కవిత కూడా అదే వాదనతో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే స్పందించిన సుప్రీం కోర్టు.. గతేడాది నవంబర్ 20 వరకు కవితకు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దని ఈడీకి ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నవంబర్ 20 వరకు ఎమ్మెల్సీ కవితను విచారణకు పిలవబోమని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అప్పట్నుంచి ఈ కేసులో కవితకు ఎలాంటి నోటీసులు రాలేదు. తాజాగా ఇప్పుడు నోటీసులిచ్చారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు వస్తున్న క్రమంలో.. కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.