TPCC Protest : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ నమోదు చేయడంపై టీపీసీసీ భగ్గుమంది. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట టీపీసీసీ అగ్ర నేతలు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. దేశంలో కులగణనను అడ్డుకోవడానికే సోనియా, రాహుల్‌లపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్‌ను చూసి ప్రధాని మోడీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భయపడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల కోసం ఈవీ మిషన్లు వద్దు.. బ్యాలెట్ పేపర్లే కావాలన్న ఏఐసీసీ ప్లీనరీ నిర్ణయానికి బీజేపీ దడుసుకుందన్నారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబానికి దేశ ప్రజలు సదా అండగా నిలుస్తారని డిప్యూటీ సీఎం భట్టి(TPCC Protest) తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి దేశ ప్రజలంతా కలిసి కాంగ్రెస్‌ను గెలిపించుకుంటారని చెప్పారు.
Also Read :Waqf Act : వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను నియమించొద్దు.. కేంద్రానికి సుప్రీం ఆదేశం
‘‘తెలంగాణలో కులగణనతో ప్రధాని మోడీకి దడ’’
‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేశాం. 56 శాతం మంది బీసీలు ఉన్నారని గుర్తించాం. మిగతా వర్గాల సమాచారాన్ని కూడా లెక్కలతో సహా ప్రకటించాం. ఎవరి దగ్గర ఎన్ని ఆస్తులు, వనరులు ఉన్నాయో.. ఏ వనరులు ఎవరికి పంచాలనేది లెక్కల ద్వారా స్పష్టంగా గుర్తించాం. ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న రాహుల్ గాంధీ పిలుపునకు మోడీ భయపడుతున్నారు’’ అని భట్టి విక్రమార్క విమర్శించారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన సర్వేను దేశవ్యాప్తంగా చేస్తే.. ప్రధాని మోడీ స్నేహితులైన అంబానీ, ఆదానీలకు దోచి పెడుతున్న సంపద, వనరులను ఇకపై అణగారిన వర్గాల ప్రజలందరికీ పంచాల్సి వస్తుందనే ఆందోళన మోడీకి ఉంది. కార్పొరేట్ సంస్థల అండతో బీజేపీ బతుకుతోంది. కాంగ్రెస్ పార్టీకి సామాన్య ప్రజల అండ ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read :Aliens Attack: ఏలియన్స్ ఎటాక్.. రాళ్లుగా మారిన సైనికులు.. సంచలన నివేదిక
‘‘ఈడీ కేసులను జర్నలిస్టులు ఎండగట్టాలి’’
‘‘నేషనల్ హెరాల్డ్ పత్రికలో పనిచేస్తున్న వారికి జీతాలు ఇవ్వాలని, కరెంట్ బిల్లులు కట్టాలని రూపాయి, రూపాయి పోగేసి చందాలు వేసుకుని డబ్బులు ఇస్తే కేసులు పెట్టడం న్యాయమా? జర్నలిస్టులకు అండగా నిలబడిన కాంగ్రెస్ అగ్ర నేతలపై కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అక్రమంగా పెట్టిన ఈడీ కేసులను సమస్త జర్నలిస్టులు ఎండగట్టాలి’’ అని ఈసందర్భంగా డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమిటో అందరికీ తెలిసి వస్తుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, తప్పుడు కేసులు పెట్టేటువంటి సంస్థలు, వ్యవస్థలను కట్టడి చేసి ప్రజాస్వామిక రూపంలోకి తెస్తామని భట్టి చెప్పారు.