తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ (TPCC President) మహేష్ కుమార్ గౌడ్ ఓ కీలక విజ్ఞప్తి చేస్తూ ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన కుల గణన అంశాలపై, కాంగ్రెస్ నాయకులకు కొన్ని సూచనలు సూచించారు. చారిత్రాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే (కులగణన) ఎట్టకేలకు రాష్ట్రంలో ప్రారంభమైందన్నారు. కులగణన అనేది బడుగు బలహీన వర్గాలు ప్రజలకు అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం అని ఆయన తెలిపారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో కులగణనపై ఖచ్చితమైన హామీ ఇచ్చారు. కులగణన చేపట్టి ఆయా కులాల జనాభాను బట్టి రిజర్వేషన్లు కూడా పెట్టి సామాజిక న్యాయాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామని ఖచ్చితమైన హామీ ఇచ్చారు. కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకొని పెద్దఎత్తున కార్యక్రమాన్ని చేపట్టింది. 85 వేల మంది ఉద్యోగస్తులతో 6వ తేదీ నుంచి కులగణనకు రంగంలోకి దిగింది. కులగణనను దేశానికి ఆదర్శంగా, రోల్ మోడల్ గా తెలంగాణ కులగణన ఉండాలని అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read: SSC CHSL Exam 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టైర్ II పరీక్ష రాసే అభ్యర్థులకు అలర్ట్!
రాష్ట్రంలో అన్ని సామాజిక సంఘాలతో రాహుల్ గాంధీ ఈ నెల 5వ తేదీన సమావేశమై అభిప్రాయాలు కూడా తీసుకొని ప్రభుత్వానికి దిశానిర్దేశం చేశారు. ఇంత పకడ్బందీగా బడుగు బలహీన వర్గాల బాగు కోసం కృషి చేస్తుంటే ప్రతిపక్ష రాజకీయ పక్షాలు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రతిపక్ష పార్టీల కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్థాయిలలో నాయకులు కులగణన సర్వే లకు పూర్తిగా సహకారం అందించాలని, అటు ప్రజలలో చైతన్యం చేయడంతో పాటు రాజకీయ కుట్రలను తిప్పికొడుతూ కులగణన ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని వెల్లడించారు.
నవంబర్ 5వ తేదీన హైదరాబాద్ గాంధీయన్ నాలెడ్జి సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ చెప్పిన అంశాలను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలను కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, క్యాబినెట్ మంత్రుల ఆమోదంతో ప్రతిష్టాత్మకమైన తీసుకున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటింటికి ప్రభుత్వ ఎన్యూమలేటర్స్ తో వెళ్లి ప్రజలకు అవగహన అందిస్తూ ఎటువంటి సందేహాలు/ సమస్యలు ఉన్న నివృతి చేసి ప్రభుత్వానికి – కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
నవంబర్ 6వ తారీకు నుండి “ఇంటింటికి సమగ్ర కులగణన”, హౌస్ లిస్టింగ్, సర్వే చేయడం ప్రారంభించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల మంచికోసం తీసుకున్న ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో కార్యకర్తలు పాల్గొనేలా చేయాలనీ ఆదేశిస్తూ, అలాగే ఇక నుండి పార్టీ ఆఫీస్ లోని “కనెక్ట్ సెంటర్” నుండి రోజువారీ కాంటాక్ట్ లో ఉంటూ ఫోన్ చేస్తారని తెలిపారు. కార్యకర్తలకు ఏదైనా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోవాలన్నారు. నవంబర్ 26వ తారీకు దాకా జరిగే ఈ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నట్లు ఆయన ప్రకటనలో తెలిపారు.
