మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో…ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ సత్తా చాటాలని భావిస్తోంది. ఉపఎన్నికలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతూ ముందుకు సాగుతోంది. దీనికోసం TPCC వినూత్న ప్రణాళికను రెడీ చేసింది. మునుగోడులో పాదయాత్ర చేయాలని నిర్ణయించింది. అంతేకాదు…గడపగడపకు వెళ్లి లక్షమంది కాళ్లె మొక్కి ఓట్లు అడగాలని ప్లాన్ చేసింది. దీనికోసం తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అభిమానులు వెయ్యిమంది రంగంలోకి దిగినట్లుగా సమాచారం. వీరందరితో కలిసి స్పెషల్ టీంను ఏర్పాటు చేశారట. ఓవైపు పార్టీ నేతల ప్రచారంలో బిజీబిజీగా ఉంటే…రేవంత్ గ్రూప్ ఓటర్ల కాళ్లు మొక్కేలా ప్రణాళిక రెడీ చేశారు.
ఇక మరోవైపు మునుగోడు ఉపఎన్నికను అధికార టీఆరెస్, బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అన్నిపార్టీలూ తమ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు భారీ బహిరంగ సభలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈ సరికొత్త ప్రచారానికి రెడీ అవుతోంది. మరి టీపీసీసీ ప్లాన్ సక్సెస్ అవుతుందా….బెడిసి కొడుతుందా అనేది చూడాల్సిందే.