Warangal Declaration : రేవంత్ రెడ్డి దాని కోసం వైన్, కల్లు నమ్ముకున్నారా?

ఏం చేసైనా సరే జనాల్లోకి వెళ్లిపోవాలి. చర్చ జరగాలి, నలుగురి నోట్లో నానాలి. అందరూ మాట్లాడుకోవాలి. మార్కెటింగ్‌లో అతిపెద్ద సూత్రం ఇదే

  • Written By:
  • Publish Date - May 18, 2022 / 10:52 AM IST

ఏం చేసైనా సరే జనాల్లోకి వెళ్లిపోవాలి. చర్చ జరగాలి, నలుగురి నోట్లో నానాలి. అందరూ మాట్లాడుకోవాలి. మార్కెటింగ్‌లో అతిపెద్ద సూత్రం ఇదే. అలా జరిగినప్పుడే అద్భుతమైన మార్కెటింగ్ జరిగినట్టు
లెక్క. సరిగ్గా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మొన్నామధ్య వరంగల్ డిక్లరేషన్ విడుదల చేశారు. తెలంగాణ సమాజంలో దీనిపై పెద్ద చర్చే జరిగింది. ఆ
విషయంలో తొలి విజయం దక్కించుకున్నట్టే లెక్క. కాని, ఈ డోసు సరిపోదు. రాజకీయ దురంధరుడుగా పేరున్న కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే ఇదేమాత్రం సరిపోదు. అందుకే, రైతుల ఓట్లు గంపగుత్తగా
రాబట్టడం కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకు వరంగల్ రైతు డిక్లరేషన్‌ను ప్రధాన అస్త్రంగా మలుచుకోవాలనుకుంటున్నారు. అధికారంలోకి వస్తే రైతులకు ఏమేం చేయబోతున్నామో చెప్పడమే రైతు డిక్లరేషన్. మరి ఈ విలువైన హామీ పత్రం రైతులందరికీ చేరేదెలా? ఇందుకోసం పెద్ద ప్లానే వేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు, కల్లు కాంపౌండ్ల ముందు భారీ ఫ్లెక్సీలు పెడతారట. రైతు
డిక్లరేషన్ మొత్తాన్ని ఫ్లెక్సీల్లోకి ఎక్కించి అందరూ చదువుకునే వీలు కల్పిస్తామన్నారు రేవంత్ రెడ్డి.

వైన్ షాపులు, కల్లు కాంపౌండ్ల ముందు ఫ్లెక్సీలు పెట్టడం అంటే.. రైతులంతా తాగుబోతులనా.. అనే అర్ధం రావొచ్చు. కాని, తెలంగాణ సమాజంలో తాగడం అనేది చాలా కామన్. పండగ అంటేనే మందు,
ముక్క. సో, తప్పేం లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయినా ఒక్క రైతులే డిక్లరేషన్ చూడాలనేం ఉంది. రైతులకు మంచి చేస్తున్నారన్న కోణంలో ఎవరు చదివి మెచ్చుకున్నా ప్లాన్ సక్సెస్ అయినట్టే. పైగా తెలంగాణలో మద్యం
అమ్మకాలు రోజురోజుకు రికార్డ్ సృష్టిస్తున్నాయి. మద్యం షాపులు వెలవెలబోవడం అన్నదే జరగదు. ఈ లెక్కన ఇక్కడ ఫ్లెక్సీలు పెడితే.. దాదాపు సగం మందికి డిక్లరేషన్ చేరిపోయినట్టే లెక్క. అయినా ఒక్క
వైన్ షాపులు, కల్లు కాంపౌండ్ల ముందే కాదు.. రైతు బజార్లు, ఐకేపీ కేంద్రాల ముందు కూడా ఫ్లెక్సీలు పెడతారట. అంతేకాదు, జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం కాబట్టి ఆ రోజు డప్పు చప్పుళ్లు
వినిపించి వరంగల్ డిక్లరేషన్‌ను ప్రజలకు వినిపిస్తామన్నారు. ఇక మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు 400 మంది నేతలతో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఫ్లెక్సీలే
కాదు కరపత్రాలు కూడా పంచబోతున్నారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి ప్లాన్ అద్దిరింది అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.