Revanth Reddy: రాహుల్ పర్యటన వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్

తెలంగాణలో కాంగ్రెస్ కు ఎంత బూస్ట్ ఇచ్చినా దాని పనితీరు అలాగే ఉంది. పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్యలు తప్పడం లేదు.

  • Written By:
  • Updated On - May 6, 2022 / 12:19 PM IST

తెలంగాణలో కాంగ్రెస్ కు ఎంత బూస్ట్ ఇచ్చినా దాని పనితీరు అలాగే ఉంది. పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్యలు తప్పడం లేదు. అందుకే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇక లాభం లేదనుకుని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని రాష్ట్రానికి రప్పించారు. కొన్నాళ్ల కిందట పార్టీలో కీలక నేతలను ఢిల్లీకి పిలిపించుకుని రాహుల్ మాట్లాడారు. పార్టీలో అంతా కలిసి పనిచేయాలని చెప్పారు. దీనివెనుక రేవంత్ రెడ్డి స్కెచ్ ఉందని అప్పుడే నేతలంతా భావించారు. ఇప్పుడు ఏకంగా జనంలోకి కాంగ్రెస్ ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకువచ్చారు. వరంగల్ సభతో సమరానికి సిద్ధమయ్యారు.

గాంధీభవన్ లో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో ఆయన చేసే దిశానిర్దేశం బట్టి నేతలంతా ఏమేరకు ఉత్తేజితులవుతారు, పార్టీకి పునరంకితమవుతారు అన్నది తేలిపోతుంది. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా సమయమున్నా సరే.. ఇప్పటి నుంచే పార్టీలన్నీ గ్రౌండ్ లెవల్లో దూసుకుపోతున్నాయి. బీజేపీకి దీటుగా పోరాడుతూనే అధికారపార్టీ అయిన టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా
పోరాటం చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దల నుంచి రాష్ట్రంలో ఉన్న బీజేపీ క్యాడర్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి కొంతమేరే ఉంది. ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంటే రాహుల్ గాంధీ ఇప్పటికి టైమిచ్చి తెలంగాణకు వచ్చారు.

రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తరువాత రాహుల్ గాంధీ తొలిసారిగా తెలంగాణకు వస్తున్నారు. అంటే దాదాపు మూడేళ్ల తరువాత ఆయనకు రాష్ట్రానికి రావడానికి కుదిరింది. అందుకే శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాహుల్ పర్యటనను విజయవంతం చేయడానికి రేవంత్ రెడ్డి శ్రమించారు. వరంగల్ రైతు సంఘర్షణ సభ తరువాత విద్యార్థులు-నిరుద్యోగుల కోసం, ఇంకా ఎస్సీ,ఎస్టీ,బీసీల కోసం, మహిళల కోసం వేరు వేరు సభలను నిర్వహించడానికి పార్టీ ప్లాన్ చేసింది. వరంగల్ సభలో వ్యవసాయ విధానాన్ని ప్రకటించి.. రైతులను ఆకర్షించడానికి ప్లాన్ చేసింది. ఇప్పటికే రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు కాని, చంచల్ గూడ జైలులో ఉన్న విద్యార్థులను పరామర్శించడానికి కాని అనుమతి లేదు. కానీ దీనికోసం పార్టీ చేసిన పోరాటాం మాత్రం జనంలోకి వెళ్లింది. అందుకే దీనిని ఇకపై నిరంతరంగా క్యాష్ చేసుకోవడానికి వీలుగా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పుడు రాహుల్ గాంధీని రప్పించడం వల్ల పార్టీలో రేవంత్ ఇమేజ్ పెరిగినట్లయిందని.. దానిని పార్టీ బలోపేతానికి ఆయన ఉపయోగించుకుంటారా.. వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి వినియోగించుకుంటారా అన్నదానిపై రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.