తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రానికి తక్షణమే రూ.2 వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఊహించని విధంగా వరదల కారణంగా 11 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. వరదల సమయంలో ఎలాంటి పంటలకు నష్టం వాటిల్లలేదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై ఆయన మండిపడ్డారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు తనతో కలిసి రావాలని మంత్రి కేటీఆర్‌కు ధైర్యం చెప్పారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రేవంత్ కోరారు.
రేవంత్ లేఖలోని ముఖ్యాంశాలివే..
100 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో కుంభవృష్టి కురిసి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో పత్తి, సోయాబిన్, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా నీట మునిగి సర్వనాశనమైతే.. ఎకరం కూడా పంట నష్టం జరగలేదని ట్విటర్ పిట్ట కారు కూతలు కూస్తోంది. భారీ వర్షాలు పడ్డప్పటికీ రాష్ట్రంలో పెద్దగా పంట నష్టం జరిగినట్లు సమాచారం లేదని, కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించడం ఆవివేకం.
• నేను కేటీఆర్ కు సవాలు విసురుతున్నా. ఇద్దరం కలిసి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వరద ప్రాంతాల్లో పర్యటిద్దాం. ఎకరం పంట కూడా మునగకపోతే..నేను ముక్కు నేలకు రాస్తా. పంట నష్టం జరిగిందని నిరూపిస్తే..నీవు ముక్కు నేలకు రాసి తెలంగాణ రైతులకు క్షమాపణ చెబుతావా? కళ్ల ముందు ఇంత ఘోరం కనిపిస్తుంటే కడుపుక అన్నం తినేవాడు ఏవడైనా పంట నష్టం జరగలేదని మాట్లాడతాడా? రాష్ట్రంలో రైతులను, వ్యవసాయాన్ని గాలికి వదిలేశారు. ప్రకృతి కరుణించి, రైతులు కష్టంచి పంట పండిస్తే అది మా క్రెడిట్ అని అయ్యా కొడుకులు తమ ఖాతాలో వేసుకుంటారు. అదే ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగినా, మద్దతు ధర రాకపోయినా..రైతుల ఖర్మ అని వదిలేస్తారు.
• కమీషన్లు వస్తాయి కాబట్టి లక్ష కోట్లతో ప్రాజెక్టులు కడతారు. కానీ వాటి నిర్వహణకు నయాపైసా విడుదల చేయరు. కాంట్రాక్టర్లకు, రీడైజన్లకు కమీషన్ ఇచ్చే వారికి ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయి గానీ, ప్రాజెక్టుల నిర్వహణకు మాత్రం నిధులు విడుదల చేయరు. దీన్ని బట్టి మీకున్న ధన దాహం, అధికార దాహం అర్థమవుతోంది.
• ‘సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.1.52 లక్షల కోట్లు వెచ్చించాం’.. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం చేసిన ప్రకటన ఇది. కానీ, ఇలా కట్టుకున్న ప్రాజెక్టులను, ఇదివరకే కట్టిన ప్రాజెక్టులను కాపాడుకునే బాధ్యతను ప్రభుత్వం గాలికొదిలేసింది. తాజాగా గోదావరి పరీవాహకంలోని కడెం ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో ఓ దశలో కొట్టుకుపోతుందేమో?అనే భయం వెంటాడింది. కానీ, అదృష్టం బాగుండి గండం గట్టెక్కింది. ఇదనే కాదు.. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటి పరిస్థితి కొంచెం అటుఇటుగానే ఇలానే ఉంది.
• ప్రాజెక్టుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఈఎన్‌సీ (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) నేతృత్వంలో విభాగాన్ని ఏర్పాటు చేసినా… నిధులు ఇవ్వకపోవడం, అధికారాలు పరిమితంగా ఉండడంతో ఆ ఉద్దేశం నీరుగారుతోంది. ఈ విభాగం కింద పనులు చేపట్టాలంటే చాలు కాంట్రాక్టర్లు ఆమడదూరం పారిపోతున్నారు. ఓ ప్రాజెక్టు గేట్లకు ఏటా రూ.20వేలతో గ్రీజింగ్ చేయాలి. నిధులు లేక పనులు చేయకపోవడంతో ఆ గేట్లకు ప్రస్తుతం రూ.3కోట్ల దాకా వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది’ కాళేశ్వరంలోని రెండు కీలక పంప్ హౌజ్‌లు లక్ష్మీ (మేడిగడ్డ) పంప్‌హౌజ్, సరస్వతి (అన్నారం) నీట మునిగాయి. లక్ష్మీ పంప్‌హౌజ్‌లో 17 మోటార్లు/ పంపులు; సరస్వతి పంప్‌హౌజ్‌లో 12 మోటార్లు పూర్తిగా నీట మునిగాయి.
• ఈ ప్రాజెక్టు మునగడం వెనుక టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి కూడా ఉంది. కేసీఆరే ఓ ఇంజనీర్‌గా దగ్గరుండి పనులు డిజైన్ చేశారు. కేసీఆర్ అనాలోచిత విధానాలు, అర్థపర్థం లేని డిజైన్లే ప్రస్తుత స్థితి కారణం. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ వంటి లక్ష్మీ పంపుహౌజ్ నుంచే నీటిని ఎత్తిపోస్తారు. దాంతో, భారీ వరదలు వస్తే తట్టుకునేలా రూపకల్పన ఎందుకు చేయలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
• తెలంగాణలో పంటల పరిస్థితి గాలిలో దీపంగా మారింది. అన్నదాతలను కష్టకాలంలో ఆదుకోవాల్సిన పంటల బీమా పథకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పట్టింపులతో అందని ద్రాక్షలా మారుతున్నాయి. రాష్ట్రంలో మూడేళ్లుగా వానాకాలం పంటల సాగు ప్రారంభంలోనే కుండపోత వర్షాలు కురుస్తుండటం.. పంట నష్టం జరిగినా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎం-ఎ్‌ఫబీవై) పథకాన్ని తెలంగాణలో ఎత్తివేయడం, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడంతో అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు నష్టపరిహారం లభించడం లేదు.
• ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, మెదక్, హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పంటలపై భారీ వర్షాల ప్రభావం పడింది. హనుమకొండ జిల్లాలో 77,163 ఎకరాల్లో వివిధ పంటలు వేయగా చాలావరకు నీట మునిగాయి. వరంగల్ జిల్లాలో పత్తి, మొక్కజొన్న, కంది, పెసర 90 శాతం మునిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 13 వేల ఎకరాల్లో పత్తి, 24 వేల ఎకరాల్లో వరిది ఇదే దుస్థితి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పత్తి, కంది, మొక్కజొన్న, పెసర, మినుము, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో కాకర, బీర తోటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో 4.60 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. వీటిలో వేల ఎకరాల్లో నీట మునిగాయి. నిజామాబాద్ జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంటలకూ ఇదే పరిస్థితి ఎదురైంది.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఈ పథకం నుంచి వైదొలిగాయి. కానీ ఇతర రాష్ట్రాలు రైతులకు పంటల బీమా పథకాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏ ఒక్క పంటల బీమా పథకాన్నీ అమలు చేయలేదు. బెంగాల్ ప్రభుత్వ పంటల బీమా పథకాన్ని అధ్యయన చేసేందుకు బృందాన్ని పంపిస్తామని సీఎం కేసీఆర్ గతంలో అసెంబ్లీలో ప్రకటించారు. అయినా ఇంతవరకూ బృందం వెళ్లలేదు.
• కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం దహెగాం మండలంలోని ఐనం, చిన్న ఐనం, పెసరి కుంట, బీబ్ర గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కలెక్టర్ రాహుల్రాజ్ సింగరేణి కాలరీస్ కు చెందిన రెస్క్యూ టీమ్ ను దహేగాం కు రప్పించారు. ఆ రెస్క్యూ టీమ్ లోని చెలక సతీశ్ (32), అంబాల రాము (29) వరదలో గల్లంతయ్యారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో సంభవించిన ఈ నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వా నష్టం అంచనాపై నివేదిక కోరాలి. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన పంటపై గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అంచనాలు, ఎన్యూమరేషన్ చేయడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు ఉంటే తప్ప అంచనా వేయలేమని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పంట నష్టం అంచనాకు తక్షణమే కేంద్ర బృందాన్ని పంపండి. తక్షణ సాయంగా రూ.2000 కోట్లను విడుదల చేయండి. రైతులకు ఎకరాకు రూ. 15000 పరిహారం ఇచ్చి, తిరిగి పంట వేసుకోవడానికి అవసరమైన విత్తనాలు, పెట్టుబడి సాయం అందించాలి.
Wrote a letter to the PM to declare the situation in Telangana as a National Disaster.
The National Disaster Response Force should be deployed immediately to alleviate the situation. 1/4 pic.twitter.com/hFZszhMB4H— Revanth Reddy (@revanth_anumula) July 16, 2022