Mahesh Kumar Goud : తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ విధానాలకు విరుద్ధంగా తరచూ వ్యాఖ్యానించడం, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించడం నేతల్లో, కేడర్‌లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేను తగులబెట్టిన వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఆయనపై క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు. సర్వేను తగులబెట్టడంతోపాటు, దీనిపై అనేక ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆయన తీరుపై సీరియస్ అయింది. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, కులగణన సర్వేను శాస్త్రీయంగా నిర్వహించినట్లు స్పష్టం చేశారు. ఈ సర్వేలో బీసీల జనాభా 56 శాతానికి పైగా ఉన్నట్లు తేలిందన్నారు. అయితే, బీఆర్ఎస్ నేతలు బీసీ సంఘాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని బీసీ సంఘాలు మార్గభ్రష్టమవుతున్నాయని, అలాంటి వలలో పడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Diabetes: మధుమేహం ఉన్నవారు పాలు తాగవచ్చా.. తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తగిన చర్యలు ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీ అజెండాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు. “ఎవరైనా ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, పార్టీకి కట్టుబడి ఉండాలి. క్రమశిక్షణను పాటించకుంటే చర్యలు తప్పవు. క్రమశిక్షణ కమిటీ దానిపై తగిన నిర్ణయం తీసుకుంటుంది” అని ఆయన పేర్కొన్నారు.
అలాగే, గురువారం కాంగ్రెస్ కుటుంబ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మీటింగ్‌లో అన్ని అంశాలను చర్చించి పరిష్కారం కనుగొంటామని తెలిపారు. తెలంగాణలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న హక్కులను సాధించిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల చొరవతో బీసీలకు, ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో మొదటిసారి బీసీ కులగణన చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ఇది చారిత్రక విజయమని కొనియాడారు. బిహార్ లాంటి రాష్ట్రాల్లో కులగణన చేపట్టినా, అది కార్యరూపం దాల్చలేదని గుర్తుచేశారు.
ప్రతిపక్ష పార్టీలు కులగణనపై విమర్శలు చేయడం మానుకుని, ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించాలంటూ హితవు పలికారు. “కులగణన ఒక చారిత్రక అవసరం. దీన్ని విమర్శించడం కన్నా, దీని ప్రయోజనాలను అర్థం చేసుకోవడం మంచిది” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో తీన్మార్ మల్లన్న వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న కారణంగా ఆయనపై క్రమశిక్షణాత్మక చర్యలు తప్పవని సంకేతాలు కనిపిస్తున్నాయి. గురువారం జరిగే కాంగ్రెస్ కుటుంబ సమావేశం అనంతరం ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ రిటైర్ అవుతాడా? కోహ్లీపై బీసీసీఐ నిర్ణయం ఏంటీ!