Etela Rajender: రేపు ఈట‌ల రాజేంద‌ర్ దంప‌తుల ప్రెస్‌మీట్‌.. ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చేస్తారా?

బీజేపీ ఎమ్మెల్యే, చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈట‌ల రాజేంద‌ర్ దంప‌తులు రేపు ప్రెస్‌మీట్ పెడుతున్నట్లు మీడియాకు స‌మాచారం అందింది. దీంతో వారు ఏ అంశంపై మాట్లాడతార‌నే విష‌యం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉత్కంఠ రేపుతుంది.

  • Written By:
  • Updated On - June 26, 2023 / 09:00 PM IST

బీజేపీ ఎమ్మెల్యే, చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈట‌ల రాజేంద‌ర్ (Etela Rajender) ఆ పార్టీని వీడుతున్నారా? ఆయ‌న కాంగ్రెస్ పార్టీ  (Congress Party) కండువా క‌ప్పుకోబోతున్నారా? కొద్దికాలంగా ఈ అంశంపై తెలంగాణ రాజ‌కీయాల్లో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతుంది. గ‌త రెండు రోజుల క్రితం ఢిల్లీవెళ్లిన ఈటల బీజేపీ (BJP) అధిష్టానం పెద్ద‌ల‌తో భేటీ అయ్యారు. అయితే, ఈ బేటీలో ఈట‌ల లేవ‌నెత్తిన అంశాల‌పై అదిష్టానం పెద్ద‌ల నుంచి స్ప‌ష్ట‌మైన‌ స‌మాధానం రాలేద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆదివారం సాయంత్రం నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో జ‌రిగిన బీజేపీ జాతీయ అధ్య‌క్షులు జేపీ న‌డ్డా బ‌హిరంగ స‌భ‌లోనూ ఈట‌ల పాల్గొన‌లేదు. దీంతో ఈట‌ల పార్టీ వీడ‌టం ఖాయ‌మ‌న్న ప్ర‌చారం మ‌రింత జోరందుకుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో రేపు (మంగ‌ళ‌వారం) ఈట‌ల‌ రాజేందర్ ఆయ‌న స‌తీమ‌ణితో ప్రెస్‌మీట్ పెడ‌తార‌ని మీడియాకు స‌మాచారం అందింది.

తెలంగాణలో మ‌రికొద్ది నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో అధికార బీఆర్ఎస్‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీలు అధికార‌మే ల‌క్ష్యంగా రాజ‌కీయ వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నాయి. దీంతో కొద్దిరోజులుగా తెలంగాణ రాజ‌కీయాల్లో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని వీడిన పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలో ఈట‌లసైతం బీజేపీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొగ్గుచూపుతున్న‌ట్లు ప్ర‌చారం జోరందుకుంది. దీంతో ఆయ‌న స‌తీమ‌ణితో క‌లిసి మంగ‌ళ‌వారం నిర్వ‌హించే ప్రెస్‌మీట్‌లో ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తార‌ని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జ‌రుగుతుంది.

ఈట‌ల రాజేంద‌ర్ వ‌ర్గీయుల్లోని కొంద‌రు మాత్రం ఆయ‌న బీజేపీ వీడుతార‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండిస్తున్నారు. ఈట‌ల బీజేపీలోనే ఉంటార‌ని, ఆ పార్టీ వీడ‌ర‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి. త‌న‌పై పార్టీ మారుతున్న‌ట్లు వ‌స్తున్న ప్ర‌చారాన్ని ఖండించేందుకే ఈట‌ల దంప‌తులు ప్రెస్ మీట్ పెట్ట‌బోతున్నార‌ని వారు పేర్కొంటున్నారు. మ‌రోవైపు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వ్య‌వ‌హారంపై మాట్లాడేందుకు వీరు ప్రెస్ మీట్ పెడుతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. కౌశిక్ రెడ్డి ముదిరాజ్ సామాజిక వ‌ర్గంపై త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేశార‌ని ఆ సామాజిక వ‌ర్గం నేత‌లు మండిప‌డుతున్నారు.

కౌశిక్ రెడ్డి ముదిరాజ్ సామాజిక వ‌ర్గంపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఆడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ అంశంపై మాట్లాడేందుకు ఈట‌ల దంప‌తులు ప్రెస్‌మీట్ పెడుతున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతుంది. మొత్తానికి ఈట‌ల దంప‌తులు ప్రెస్‌మీట్ లో ఏం చెబుతార‌న్న అంశంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉత్కంఠ‌త‌ను రేపుతోంది.

Ponguleti Srinivas Reddy : ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మాట ఏ వేదిక‌పై చెప్ప‌లేదు.. పొంగులేటి చెప్పిన ఆ మాటేంటి?