- తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో బిజెపిలోకి ఆమని
- ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా వెలిగిన ప్రముఖ నటి ఆమని
- ‘మిస్టర్ పెళ్లాం’, ‘శుభలగ్నం’ వంటి విజయవంతమైన చిత్రాలతో ఫుల్ ఫేమస్
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెలబ్రిటీల సందడి మొదలైంది. ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా వెలిగిన ప్రముఖ నటి ఆమని ఇవాళ భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకోనున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో బలం పుంజుకోవాలని చూస్తున్న బీజేపీ, ఆమని వంటి ప్రజాదరణ ఉన్న నటీమణులను చేర్చుకోవడం ద్వారా గ్లామర్ పెంచుకోవడంతో పాటు మహిళా ఓటర్లను ఆకర్షించాలని భావిస్తోంది.
ఆమని సినీ కెరీర్‌ను చూస్తే. ‘మిస్టర్ పెళ్లాం’, ‘శుభలగ్నం’ వంటి విజయవంతమైన చిత్రాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వివాహం చేసుకుని సినిమాలకు కొన్నాళ్లు విరామం ఇచ్చిన ఆమె, సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై, టీవీ సీరియల్స్‌లో బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయడం ద్వారా ప్రజా సేవలో తన వంతు పాత్ర పోషించాలని ఆమె నిర్ణయించుకున్నారు. బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Amani Bjp
మరోవైపు గత కొద్ది రోజులుగా సీనియర్ నటి మీనా కూడా బీజేపీలో చేరుతారంటూ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. దక్షిణాదిలో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న మీనా చేరికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నప్పటికీ, ఆమె ఆ వార్తలను తోసిపుచ్చారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేయడంతో ఆ ప్రచారానికి తెరపడింది. అయితే, ఆమని చేరిక ఖరారు కావడంతో ఇవాళ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఆమె పార్టీ తరపున ఎంతవరకు ప్రచారం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
