AI Fake Call : AI వీడియో కాల్తో టోకరా… డబ్బులు పోగొట్టుకున్న టీడీపీ నేత

AI Fake Call : సత్తుపల్లి ప్రాంతంలోని టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకున్న ఒక మోసగాడు, దేవినేని ఉమ మహేశ్వరరావు వ్యక్తిగత సహాయకుడిని (PA)గా నటించాడు

Published By: HashtagU Telugu Desk
Ai Fake Call

Ai Fake Call

ఖమ్మం జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి పెద్దఎత్తున మోసం జరిగిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. సత్తుపల్లి ప్రాంతంలోని టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకున్న ఒక మోసగాడు, దేవినేని ఉమ మహేశ్వరరావు వ్యక్తిగత సహాయకుడిని (PA)గా నటించాడు. ఆ వ్యక్తి కొంతమంది నేతలకు ఫోన్ చేసి “సార్ మాట్లాడతారు” అంటూ వీడియో కాల్‌కు కనెక్ట్ చేశాడు. వీడియోలో దేవినేని ఉమ లా కనిపించిన వ్యక్తి నేతలతో మాట్లాడి, కొందరికి ఆర్థిక సహాయం అందించాలనుకుంటున్నట్టు చెప్పడంతో వారు నమ్మకం పొందారు. ఈ నేపథ్యంలో కొంతమంది పార్టీ నేతలు అతని సూచన మేరకు కొంత నగదు పంపించడం జరిగింది.

Yashasvi Jaiswal : ఢిల్లీ గడ్డపై జైస్వాల్ శతకం..!

దీంతో ఆ మోసగాడు మరింత ధైర్యంగా ముందుకెళ్లి “చంద్రబాబు నాయుడు గారు కూడా మీతో భేటీ కావాలనుకుంటున్నారు, B ఫారాలు ఇవ్వాల్సి ఉంది, కాబట్టి విజయవాడకు రండి” అంటూ వారిని పిలిచాడు. సత్తుపల్లి నుంచి కొంతమంది టీడీపీ నాయకులు విజయవాడకు వెళ్లగా, అక్కడ భేటీ ఏర్పాటుకి ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున ఇవ్వాలని ఆ వ్యక్తి కోరాడు. ఇంతవరకు నమ్మిన నాయకులు ఈ దశలో ఏదో తేడా ఉందని అనుమానం పుట్టి, వెంటనే దేవినేని ఉమను నేరుగా సంప్రదించారు. ఉమ మహేశ్వరరావు ఆ విషయం పూర్తిగా ఫేక్ కాల్ అని, తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని స్పష్టం చేశారు.

ఈ సంఘటనతో టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. AI టెక్నాలజీతో తయారు చేసిన నకిలీ వీడియో కాల్స్, ఫేక్ వాయిస్ క్లిప్స్ ద్వారా మోసగాళ్లు ఇప్పుడు కొత్త పంథాలో మోసాలు చేస్తుండటం గమనార్హం. దేవినేని ఉమ ఈ ఘటనపై అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. సైబర్ క్రైమ్ విభాగం కూడా ఈ మోసగాడి లొకేషన్‌ ట్రేస్ చేయడం ప్రారంభించింది. రాజకీయ నేతల పేర్లను, ఫోటోలు, వాయిస్ నమూనాలను ఉపయోగించి ఇలా మోసాలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు మరింత జాగ్రత్తగా ఉండాలి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన, AI టెక్నాలజీ దుర్వినియోగం ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో చూపించే మరో ఉదాహరణగా మారింది.

  Last Updated: 10 Oct 2025, 03:39 PM IST