TS : కోనాయిపల్లికి సీఎం కేసీఆర్..ఆ సెంటిమెంట్ తో ప్రత్యేక పూజలు..!!

జాతీయ రాజకీయాల్లో తన మార్క్ ను ప్రదర్శించేందుకు సీఎం కేసీఆర్ ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా ఉండాలని భావిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - October 3, 2022 / 11:42 AM IST

జాతీయ రాజకీయాల్లో తన మార్క్ ను ప్రదర్శించేందుకు సీఎం కేసీఆర్ ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా ఉండాలని భావిస్తున్నారు. అందుకోసం పకడ్బందీగా వ్యూహాన్ని రచిస్తున్నారు. అందుకే దసరా రోజు జాతీయ పార్టీ పేరు ప్రకటించి..అందులో భాగంగానే నిర్వహించాల్సిన పూజ కార్యక్రమాలను తన సెంటిమెంట్ ప్రకారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం సిద్ధిపేట జిల్లా కోనాయిపల్లికి వెళ్తున్నారు. తాను తలపెట్టిన కార్యక్రమానికి దైవానుగ్రహం కూడా తోడవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాను సెంటిమెంట్ గా భావించే కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. కోనాయిపల్లికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 5వ తేదీని ప్రకటించే జాతీయ పార్టీ పేరు ప్రతులతోపాటు ఈనెల 9 వతేదీని కేంద్ర ఎన్నికల సంఘానికి చేసుకునే దరఖాస్తు ప్రతులకు పూజలు చేయించే అవకాశం కనిపిస్తోంది.

తాను చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి దైవానుగ్రహం తీసుకోవడం కేసీఆర్ కు సెంటిమెంట్. అందులో భాగంగానే కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఆశీస్సుల తీసుకుంటారు. ఇలా ఆశీర్వాదం తీసుకుంటే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆయన నమ్మకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు…రెండు సార్లు అధికారంలోకి రావడం, పార్టీకి గుర్తింపు లభించింది. ఈ సెంటిమెంట్ ను బలంగా నమ్ముతున్నారు కేసీఆర్. అందులో భాగంగానే సోమవారం జాతీయ పార్టీకి సంబంధించిన పత్రాలు, ఈసీకి సమర్పించే అఫిడవిట్లను దేవుని ముందు ఉంచి ఆశీర్వాదం తీసుకోనున్నారు.